For Money

Business News

రూ. 81,000 కోట్ల డీల్‌…పైసా పన్ను లేదు!

జీఎస్టీ పుణ్యమా అని ఈ దేశంలో పన్ను లేని వస్తువు లేదు. సేవ లేదు. చివరికి అప్పు చేసినా.. బ్యాంకులకు అసలు, వడ్డీతో పాటు జీఎస్టీ కూడా కట్టాలి.కాని రూ.81,300 సువిశాల సిమెంట్‌ సామ్రాజ్యాన్ని అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసినా… ప్రభుత్వానికి పైసా కూడా కట్టాల్సిన పనిలేదు. 2006లో కేవలం రూ. 4500 కోట్లకు గుజరాత్‌ అంబుజా, ఏసీసీలను కొనుగోలు చేసిన స్విట్జర్‌ల్యాండ్‌ కంపెనీ హోల్సిమ్‌ ఇపుడు తన వాటాను ఏకంగా రూ. 50181 కోట్లకు అమ్మింది. అంటే సుమారు రూ.45,000 కోట్ల లాభం వస్తోంది. అయితే ఈ డీల్‌పై తాను క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదని
హల్సిమ్‌ అంటోంది. 2006లో ఈ స్విస్‌ కంపెనీ తన పెట్టుబడులను మారిష్‌ దేశం ద్వారా పెట్టింది. 2017లో మోడీ ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చిన నజరానా ఇపుడు అదానీకి, స్విస్‌ కంపెనీకి కలిసి వస్తోంది. 2017కంటే ముందే మారిషస్‌ ద్వారా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు క్యాపిటల్‌ గెయిన్స్ కట్టాల్సిన పని లేకుండా… భారత్‌, మారిషస్‌లు ఒప్పందం చేసుకున్నాయి. అంటే 2017 ముందు భారత్‌లో మారిషస్‌ ద్వారా పెట్టుబడి పెట్టిన కంపెనీలు… భవిష్యత్తులో సదరు వ్యాపారాలను అమ్మినపుడు … ఆ మధ్యకాలంలో వాటి విలువ పెరిగితే.. వాటిపై క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ కట్టాల్సిన పనిలేదు. ఇపుడు అంబుజా సిమెంట్‌, ఏసీసీ కంపెనీల విలువ రూ. 81,300 కోట్లుగా లెక్కగట్టారు. ఇందులో హోల్సిమ్‌కు ఉన్న వాటా ప్రకారం స్విస్‌ కంపెనికి అదానీలు రూ. 50,181.04 కోట్లు చెల్లిస్తారు. ఇక భారత మార్కెట్‌లో ఏసీసీ నుంచి 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీని కోసం రూ.11,259.97కోట్లు కేటాయించింది. అలాగే అంబుజాలో 26 శాతం ఓపెన్ ఆఫర్‌ కోసం కోసం రూ. 19,879.57 కోట్లు కేటాయించింది. ఓపెన్‌ ఆఫర్‌ కింద ఎవరైనా ఇన్వెస్టర్లు తమ వాటా అమ్మితే ఇందులో నుంచి నిధులు ఇస్తారు. వెరశి ఈ మొత్తం డీల్‌ రూ. 81000 కోట్లపై ప్రభుత్వానికి ఒక్కపైసా కూడా ట్యాక్స్‌ రాదన్నమాట. పోని.. ఈడీల్‌ వల్ల రూ.50,181 కోట్లు తీసుకుపోతున్న స్విస్‌ కంపెనీ ఏమైనా పన్ను కడుతుందా అంటే లేదు.
జరిమానా సంగతి
సిమెంట్‌ కంపెనీలన్నీ ముఠాగా ఏర్పడి ధరలను భారీగా పెంచారనే ఆరోపణలపై అంబుజా సిమెంట్‌పై రూ. 1164 కోట్లు, ఏసీసీపై రూ. 1148 కోట్ల జరిమానా విధించింది కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ). ఇపుడు ఈ జరిమానా తాను కట్టనని.. కొత్త యజమాని అంటే అదానీ కట్టాల్సి ఉంటుందని స్విస్‌ కంపెనీ హొల్సిమ్‌ పేర్కొంది. ఈ వ్యవహారం ఇపుడ కోర్టులో ఉంది. ఈ జరిమానా సీసీఐ లేదా కోర్టులు కొట్టేస్తాయని…ఈ భారం అదానీపై పడదని కార్పొరేట్‌ వర్గాలు అంటున్నాయి. మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున… అదానీపై ఈ భారం పడకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. సో… ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి ఒక్కపైసా కూడా లాభం రాకుండా డీల్‌ కుదిరిందన్నమాట.