For Money

Business News

నిరాశపర్చిన జీడీపీ వృద్ధిరేటు

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదైంది. ఆర్థికవేత్తల అంచనాలకన్నా ఈ వృద్ధిరేటు తక్కువగా ఉంది. సీఎన్‌బీసీ టీవీ18 చేసిన సర్వేలో పాల్గొన్న ఆర్థిక వేత్తలు జీడీపీ వృద్ధిరేటు 5.7శాతం ఉంటుందని అంచనా వేశారు. గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ వృద్ధి రేటు 0.7 శాతం మాత్రమే. కాని సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మాత్రం జీడీపీ వృద్ధిరేటు 8.5 శాతంగా రికార్డయింది. అంటే ఒక త్రైమాసికం నుంచి మరో త్రైమాసికం వచ్చే సరికి జీడీపీ వృద్ధి రేటు 8.5 శాతం నుంచి 5.4 శాతానికి పడిపోయింది. పూర్తి ఏడాదికి జీడీపీ వృద్ధి రేటు 8.9శాతం ఉంటుందని నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఓ) పేర్కొంది. వాస్తవానికి ఇదే సంస్థ ఇంతకుముందు ఈ జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతం ఉంటుందని అంచనా వేసింది.
నిర్మాణం డల్‌
గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు 3.2 శాతం ఉంటుందని అంచనా వేశారు. కాని అంతకుముందు ఏడాది స్థాయిలో వృద్ధి రేటు 2.6 శాతానికి పరిమితమైంది.ఒక్క మైనింగ్‌ మాత్రం 4.4 శాతం నుంచి 8.8 శాతం వృద్ధి రేటు సాధించింది. మాన్యూఫ్యాక్చరింగ్‌ రంగ వృద్ధి రేటు 1.7 శాతం నుంచి 0.2 శాతానికి పడిపోయింది. అలాగే కన్‌స్ట్రషన్‌ రంగంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి మైనస్‌ 2.8 శాతానికి పడిపోయింది.