For Money

Business News

జూబ్లిహిల్స్‌ సొసైటీ వ్యవహారంపై ఈడీ నజర్‌

జూబ్లిహిల్స్‌ కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ వ్యవహారం ముదిరి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాకా వెళ్ళింది. ఎన్‌టీవీ, టీవీ5 టీవీ న్యూస్‌ ఛానల్స్‌ మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇపుడు కేంద్ర దర్యాప్తు సంస్థల దాకా వెళ్ళాయి. జూబ్లిహిల్స్‌ కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా ఎన్‌టీవీ ఛైర్మన్‌ నరేంద్ర చౌదరి అనేక సంవత్సరాలు ఉన్నారు. ఆయన నుంచి అధికార పగ్గాలు టీవీ5 న్యూస్‌ ఛానల్‌ యజమాని రవీంద్రనాథ్‌కు వెళ్ళి తరవాత గొడవలు తారస్థాయికి వెళ్ళాయి. నరేంద్ర చౌదరి హయాంలో అనేక అవకతవకలు జరిగాయని రవీంద్రనాథ్‌ బృందం ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించి అనేక కోర్టు కేసులు నడుస్తున్న నేపథ్యంలో… ఇపుడు ఈడీ రంగంలోకి దిగింది. సొసైటీ పరిధిలోని హకీంపేట్ గ్రామం, షేక్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 403/1 (పాత నంబర్‌) సర్వే నంబర్‌ 120 (కొత్త)లోని 1,519 చదరపు గజాల స్థలం అలాట్‌మెంట్‌కు సంబంధించి ఎన్‌ఫోర్సెమెంట్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ లావాదేవీలు జరిగినపుడు సొసైటీ అధ్యక్షుడిగా ఎన్‌టీవీ న్యూస్‌ ఛానల్ ఛైర్మన్‌ టి నరేంద్ర చౌదరి ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను తమకు సమర్పించాల్సిందిగా సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడు రవీంద్రనాథ్‌కు,ఇతరులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 7వ తేదీన ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా సమన్స్‌లో పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించిన లావాదేవీల పత్రాలను కూడా తీసుకురావాలని ఈడీ స్పష్టం చేసింది. సొసైటీకి చెందిన పదేళ్ళ ఆడిట్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టులు, వార్షిక నివేదికలు, ఆడిట్‌ రిపోర్టులు, సొసైటీ బోర్డ్‌ మినిట్స్‌ను కూడా తీసుకురావాలని నోటీసులో స్పష్టం చేశారు. ఈ ఆరోపణల వచ్చిన సమయంలో సొసైటీ అంతర్గతంగా విచారణ జరిపి ఉంటే వాటి వివరాలు కూడా తీసుకురావాలని సమన్స్‌లో ఈడీ పేర్కొంది. మొత్తానికి ఎన్‌టీవీ చౌదరి హయాంలో జరిగిన ప్లాట్ల విక్రయాలపై ఈడీ విచారణ మొదలు పెట్టిందన్నమాట.