For Money

Business News

మైత్రి ప్లాంటేషన్‌ కేసు: 210 ఆస్తులు జప్తు

హైదరాబాద్‌కు చెందిన మైత్రి ప్లాంటేషన్ & హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (MPHPL)కు చెందిన 210 స్థిర ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. ఈ కంపెనీతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్లపై మనీ లాండరింగ్‌ కేసును ఈడీ నమోదు చేసింది. ఈ కంపెనీకి అనుబంధంగా ఉన్న శ్రీనక్షత్ర బిల్డర్స్ & డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SNBDIPL), మైత్రి రియల్టర్స్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ ( MRIPL) ఆ కంపెనీ డైరెక్టర్లు లక్కు కొండా రెడ్డి, లక్కు మాల్యాద్రి రెడ్డి, లక్కు మాధవ రెడ్డితో పాటు కొలికలపూడి బ్రహ్మారెడ్డి పేర్లపై ఈ ఆస్తులు ఉన్నట్లు ఈడీ తెలిపింది. 2013 మార్చి 24వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు IPC సెక్షన్ 420, 1860, సెక్షన్ 4 కింద వీరిపై కేసు నమోదు చేసారు. మొత్తం 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటి ఆధారంగా మనీలాండరింగ్‌పై ఈడీ విచారణ ప్రారంభించింది. తాము జరిపిన దర్యాప్తులో MPHPL చట్టవిరుద్ధమైన పోంజీ పథకాన్ని నడుపుతున్నట్లు తేలింది. అలాగే ఎలాంటి ప్రభుత్వం అనుమలు, లైసెన్స్‌లు లేకుండా సాధారణ ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించినట్లు ఈడీ పేర్కొంది. అధిక ప్రతిఫలం ఇస్తామని డిపాజిట్‌ దారులకు, అధిక కమీషన్‌ ఇస్తామని ఏజెంట్లను నమ్మించి భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఇలా సేకరించిన సొమ్మును MPHPLతో పాటు ఇతర గ్రూప్ కంపెనీలకు అక్రమంగా మళ్లించారని తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో శ్రీనక్షత్ర, మైత్రి పేర్లతో భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారు. లక్షలాది మంది డిపాజిట్‌దారుల నుంచి రూ. 288.42 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఇలా సేకరించిన మొత్తంలో డిపాజిట్‌దారులకు రూ.158.14 కోట్లు చెల్లించడంలో విఫలమైంది ఏపీలో 196 చోట్ల భూములు, తెలంగాణలో 13 చోట్ల ఈ కంపెనీలకు ఉన్న భూములను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. కర్ణాటకలో కూడా ఒక ఆస్తిని జప్తు చేశారు. భూములు, ప్లాట్లు, ఫ్లాట్‌లు వంటి రూపంలో ఈ ఆస్తులు ఉన్నాయని.. వీటి విలువ రూ. 110 కోట్లు ఉంటుందని ఈడీ పేర్కొంది.