For Money

Business News

రియల్టీని ఆదుకోండి!

కొత్త బడ్జెట్‌లో స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవాలని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ఈ రంగానికి ప్రాతినిధ్యం వహించే భారత స్థిరాస్తి అభివద్ధి సంఘాల సమాఖ్య (క్రెడాయ్‌) ఒక ప్రకటనను విడుదల చేసింది. కొవిడ్‌ మూడో ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకుంటే తప్ప పరిశ్రమ కోలుకోవడం కష్టమని స్పష్టం చేసింది. ముఖ్యంగా గృహ రుణాల చెల్లింపులపై ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు ఇస్తున్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని కోరింది. అలాగే స్థిరాస్థి రంగానికి వచ్చే కేంద్ర బడ్జెట్‌లో అయినా ‘మౌలిక’ రంగ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేసింది. గృహ రుణాల వార్షిక ‘అసలు’ చెల్లింపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి మరింత పెంచాలని అలాగే అందుబాటు ధరల గృహ నిర్వచనం మార్చాలని కోరుతున్నాయి. మెట్రో నగరాల్లో రూ.1.5 కోట్లు, నాన్‌ మెట్రో నగరాల్లో రూ.75 లక్షల వరకు ధర ఉండే గృహాలను ‘అందుబాటు’ (Affordable Housing)ధరల గృహాలుగానే పరిగణించాలని క్రిడాయ్‌ పేర్కొంది. రూ.20 లక్షల వరకు ఉండే వార్షిక అద్దె ఆదాయానికి పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని, స్థిరాస్తుల అమ్మకంపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిమితిని మరింత పెంచాలని కోరింది. ఏటా వడ్డీ చెల్లింపులకు ఇచ్చే పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని, భూ యజమాని నుంచి స్థలం తీసుకుని గృహ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగించేందుకు బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని క్రిడాయ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.