For Money

Business News

బాబు పాలనపై ఇక ఈడీ, సీబీఐల నజర్‌

చంద్రబాబు పాలనపై తొలి మరక. టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు ఏపీకి పరిమితమైన దర్యాప్తు ఇపుడు కేంద్ర దర్యాప్తు సంస్థల వరకు వెళ్ళింది. ఈ కేసును ఇప్పటి వరకు ఏపీ సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తూ వచ్చారు. దీనిపై తొలిసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది. ఏకంగా 26 మందికి నోటీసులు జారీ చేసింది. ఏపీ సీఐడీ అధికారులు ఇప్పటికే ఈకేసును లోతుగా దర్యాప్తు చేసి ఢిల్లీకి చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ విపిన్‌ కుమార్‌ శర్మ, ఆయన భార్య నీలం శర్మను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామంటూ షెల్‌ కంపెనీల ముసుగులో మోసాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ పెద్దలు రూ.234 కోట్ల నిధులను దారి మళ్ళించారని జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. నకిలీ ఇన్వాయిస్‌లు ద్వారా భారీగా నిధులు దారి మళ్ళించారని.. దాదాపు పలు కంపెనీలకు ఇందులో వాటా ఉందని ఏపీ సీఐడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో ఏపీఎస్‌ఎస్‌డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారని సీఐడీ ఆరోపించగా, ఇవాళ ఈడీ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పటించేందుకు చంద్రబాబు హయాంలో జర్మనీకి చెందిన సీమెన్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.