For Money

Business News

రూ.86,259 కోట్ల అప్పు దాచారు

బడ్జెట్‌లో చూపిన రుణాలు కాకుండా మార్చి నాటికి కార్పొరేషన్ల ద్వారా రూ.86,259.82 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం తీసుకుందని కాగ్‌ వెల్లడించింది. 2020-21 ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై కాగ్‌ తన నివేదికను విడుదల చేసింది. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పును బడ్జెట్‌లో చూపలేదని కాగ్‌ పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక లోటు లెక్కించే సమయంలో రూ.86,259 కోట్ల అప్పును కాగ్‌ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అప్పును కూడా రుణాలకు కలిపితే రాష్ట్ర పబ్లిక్‌ డెట్‌, ఆర్థిక లోటు మరింత పెరుగుతాయని తెలిపింది. రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు గత అయిదేళ్ళలో అత్యంత తక్కువగా 2020-21లో నమోదు అయినట్లు కాగ్‌ వెల్లడించింది. గత ఐదేళ్లతో పోల్చితే 2020-21లో నమోదైన 1.58 శాతం వృద్ధి రేటే అతి తక్కువని కాగ్‌ కుండబద్దలు కొట్టింది. ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న లక్షల పీడీ ఖాతాల వల్ల ఆర్థిక వ్యవస్థలో స్పష్టత, పారదర్శకత లోపించిందని, ఆ పీడీ ఖాతాలను ఎత్తేయాల్సిన అవసరం ఉందని కాగ్‌ తన నివేదికలో అభిప్రాయపడింది.