For Money

Business News

అరబిందో ఫార్మా లాభం 28% డౌన్‌

దేశంలో దాదాపు ప్రధాన ఫార్మా కంపెనీలన్నీ నిరాశాజనక పనితీరు కనబర్చాయి. దివీస్‌ ఫార్మా అద్భుత పనితీరు కనబర్చినా… గైడెన్స్‌ ఇవ్వలేదని భారీగా ఒత్తిడి వచ్చింది. ఇతర కంపెనీ ఫలితాలను చూస్తే ఏదో ఒక కారణంగా భారీ నష్టాలను కూడా చూపాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా కూడా నష్టాల బాట పట్టింది. మార్చితో ముగసిన చివరి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 28.2 శాతం తగ్గి రూ.802 కోట్ల నుంచి రూ.576 కోట్లకు క్షీణించింది. టర్నోవర్‌ కూడా క్షీణించి రూ.6,080 కోట్ల నుంచి రూ.5,858 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. గత ఏడాది పూర్తి సంవత్సరానికి రూ.23,776 కోట్ల ఆదాయంపై రూ.2,647 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాదిలో (2020-21) లో ఆదాయం రూ.25,155 కోట్లు ఉండగా.. లాభం రూ.5,334 కోట్లుగా నమోదైంది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.4.5 (450శాతం) డివిడెండ్‌ను ప్రకటించింది.కరోనా తగ్గుముఖం పట్టిన తరవాత దాదాపు అన్ని కంపెనీల జోరు తగ్గింది. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే ఆదాయం తగ్గడం కూడా దీనికి ప్రధాన కారణం.