For Money

Business News

రెండో స్థానానికి అదానీ పరుగు

ప్రపంచంలోనే అత్యంత ధనువంతుల జాబితాలో రెండో స్థానం కోసం అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే వారెన్‌ బఫెట్‌, బిల్‌ గేట్స్‌ను దాటేసిన అదానీ ఇపుడు రెండో స్థానంలో ఉన్న అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ స్థానానికి ఎసరు పెట్టనున్నారు. ప్రస్తుతం జెఫ్‌ బెజోస్‌ సంపద 14,900 కోట్ల డాలర్లు కాగా, గౌతమ్‌ అదానీ సంపద 14300 కోట్ల డాలర్లు. ప్రపంచంలో ఏ ధనివంతుడి సంపద కూడా అదానీ స్థాయిలో పెరగకపోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ధనవంతుల సంపద కరిగిపోయిన ఏడాదిలో అదానీ సంపద రెట్టింపు కావడమే దీనికి ప్రధాన కారణం. అదానీ సామ్రాజ్యంలో కంపెనీ లాభాలకు, కంపెనీ షేర్ల ధరలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. అదానీ గ్రీన్‌ ఎనర్జి, అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్ల ధరలు ఆయా కంపెనీల లాభాలకు 750 రెట్లు అధికంగా ఉండటం విశేషం. అలాగే అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్ల ధరలు కూడా లాభాలకన్నా 400 రెట్లు అధికంగా ట్రేడవుతున్నాయి. కొన్ని కంపెనీల షేర్ల ధరలు వాటి ఆదాయానికి 1000 రెట్లు అధికంగా ట్రేడవుతున్నాయి. మనదేశంలో అదానీ ప్రత్యర్థి అయిన ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీ షేర్‌ ధర మాత్రం లాభానికి 28 రెట్లు అధికంగా ఉంది. అదానీ కంపెనీల షేర్ల ధరలు ఇష్టారీతన పెంచేస్తున్నా… ఏ నియంత్రణ సంస్థ కూడా నోరు మెదపడం లేదు. అదానీ దూకుడు చూసిన అనేక మ్యూచువల్‌ ఫండ్‌లు, విదేశీ ఇన్వెస్టర్లు ఆ షేర్ల జోలికే వెళ్ళడం లేదు. పడితే పేకమేడల్లా కూలిపోతాయని చాలా మంది అనలిస్టులు కూడా ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు.