బాబోయ్… ఇవేం అప్పులు
ఇప్పటికే వడ్డీలు కట్టడానికి నానా కష్టాలు పడుతున్న ఏపీతో తెలంగాణ కూడా పోటీ పడి అధిక వడ్డీకి రుణాలు తేవడం ఫైనాన్షియల్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇవాళ ఆర్బీఐ 9 రాష్ట్రాల తరఫున బాండ్లను విడుదల చేసి రుణాలు సమీకరించి ఇచ్చింది. తక్కువ వ్యవధి ఉన్న రాష్ట్రాలు తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చుకోగా… దీర్ఘకాలిక రుణాలు కోరిన రాష్ట్రాలు అధిక వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ కూడా పోటీపడి దీర్ఘకాలిక రుణాలు తేవడం విశేషం. దీంతో అయిదేళ్ళ రుణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 6.54 శాతానికే రుణాలు తెచ్చుకోగా-14 ఏళ్ళ రుణానికి తెలంగాణ 7.37 శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించడం. ఇక ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్ళతో పాటు 16 ఏళ్ళ వ్యవధి ఉన్న రుణానికి కూడా 7.37 శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించింది. ఆర్థికంగా బలంగా ఉన్నాం, తమది ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం 14 ఏళ్ళ రుణానికి కూడా 7.37 శాతం వడ్డీ చెల్లించేందుకు సిద్ధం కావడం. రెండు రుణాలుగా ఏపీ రూ.2000 కోట్ల రుణాన్ని సమీకరించగా, తెలంగాణ కూడా రూ. 2000 కోట్లను సమీకరించింది. కాకపోతే ఏపీ తరఫున రుణాలను సమీకరించిన ఆర్బీఐ.. సదరు మొత్తాన్ని రాష్ట్రానికి ఇవ్వకుండా ఓడి కింద జమ చేసుకుందని సమాచారం.