కుప్పకూలిన మార్కెట్… ఎందుకిలా?
ఫ్ట్ నిఫ్టి సూచించిన నష్టాలకన్నా అధిక నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే 24000 స్థాయిని కోల్పోయింది. నిఫ్టి ఏకంగా ఒక శాతంపైగా నష్టంతో ఇపుడు 23,824 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. నిన్న గ్రీన్‌లో ఉన్న FMCG సూచీ కూడా ఇవాళ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. ముఖ్యంగా ఐటీ షేర్ల సూచీ రెండున్నర శాతం క్షీణించింది. దాదాపు అన్ని సూచీలన్నీ ఇదే ఒత్తిడి కన్పిస్తోంది. ఒకటి క్రూడ్ ధరలు పెరగడం కాగా, మరోటి బాండ్ ఈల్డ్స్ పెరగడం. దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు బాండ్ ఈల్డ్స్‌తో షాక్ తింటున్నారు. కరోనా తరవాత ఎడాపెడా అప్పులు చేసిన ప్రభుత్వాలు ఇపుడు అమ్మకానికి వస్తున్న బాండ్లను కొనుగోలు చేయలేకపోతున్నాయి. తక్కువ ధరకు బాండ్లను అమ్మేస్తున్నాయి సంస్థలు. ముఖ్యంగా జపాన్, చైనా దేశాలు అమెరికా బాండ్లను తక్కువ ధరకు కూడా అమ్ముతున్నాయి. కొనుగోలుదారులు లేకపోవడంతో… ఈల్డ్ అధికంగా పెరుగుతోంది. బాండ్ ధరలు తగ్గడమంటే ఈల్డ్స్ పెరడమే. అంటే ప్రభుత్వం బాండ్లను తిరిగి కొనేటపుడు భారీ మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. ఈ సమస్య యూరప్‌లోనూ తీవ్రంగా మారింది. కొన్న బాండ్ల ఈల్డ్స్ ఏకంగా 20 ఏళ్ళ గరిష్టానికి తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో తీవ్ర ఒత్తిడి కన్పిస్తోంది. భారత ప్రభుత్వం ప్రకటించిన జీడీపీ డేటాను మార్కెట్ నమ్మడం లేదు. దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు నిస్తేజంగా ఉన్న సమయంలో ఆకర్షణీయ డేటా రావడం పలు సందేహాలకు తావిస్తోంది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జీడీపీ డేటాపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఒక రకమైన భయం నెలకొంటోంది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది.
