For Money

Business News

జీఎస్టీ 5 శాతం శ్లాబు ఎత్తివేత!

ప్రజల నెత్తిన మరో రూ. 1.5 లక్షల కోట్ల భారం వేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. రాష్ట్రాలకు కేంద్రంపై ఆధారపడకుండా జీఎస్టీలో మార్పులు అని ప్రచారం చేస్తున్నా… వాస్తవంలో జరిగేది జనంపై అదనంగా మరో లక్షన్నర కోట్ల రూపాయల భారం. దీనికిగాను ఇప్పటి వరకు జీఎస్టీ పరిధి నుంచి మినహాయించిన వాటిని కూడా జీఎస్టీ భారం వేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మార్పులల్లో భాగంగా జీఎస్టీలో 5 శాతం శ్లాబును ఎత్తివేయాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే నెల జరుగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్నాయి. 5 శాతం శ్లాబును తొలగించి దానికి బదులుగా కొత్తగా 3 శాతం, 8 శాతం శ్లాబులను తీసుకువచ్చే అవకాశం ఉన్నది. నిత్యావసరాల వస్తువులన్నీ 5 శాతం శ్లాబులో ఉన్నాయి. ఆ శ్లాబులో ఉన్న కొన్ని వస్తువులను 3 శాతం శ్లాబులోకి, మిగతావాటిని 8 శాతం శ్లాబులోకి మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు ప్యాక్‌ చేయని, బ్రాండెడ్‌ కాని ఆహార, డెయిరీ ఉత్పత్తులకు ప్రస్తుతం జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తున్నది. వీటిని కూడా జీఎస్టీ పరిధితలోకి తెచ్చే ఆలోచన చేస్తోంది కేంద్రం. కొన్నింటిపై మాత్రం జీఎస్టీ మినహాయింపు కొనసాగించే వీలుఉంది. కొత్త జీఎస్టీ పరిధిలోకి తెచ్చే వాటిపై 3 శాతం శ్లాబులో చేర్చి… మిగిలిన వాటిని 8శాతం స్లాబులో చేర్చాలని భావిస్తోంది. రాష్ర్టాలు నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా జీఎస్టీ మండలి పలు మార్పులు చేయనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం జీఎస్టీ వల్ల ఆ ఆదాయాన్ని నష్టపోతున్న రాష్ర్టాలకు కేంద్రం పరిహారం ఇస్తున్నది. ఆ పరిహారాన్ని 2017 జూన్‌ 1 నుంచి ఐదేండ్ల పాటు ఇస్తామని ప్రకటించింది. త్వరలో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో రాష్ర్టాలు స్వయం సమృద్ధి సాధించేలా జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

జీఎస్టీలో ఒక్క శాతం పెంచినా 50 వేల కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. అదే 5 శాతం శ్లాబును 8 శాతం శ్లాబుగా మార్చితే కేంద్రానికి ఏటా అదనంగా రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వచ్చే సమావేశంలో జీఎస్టీ మినహాయింపు వర్తిస్తున్న కొన్ని వస్తువులపైనా పన్ను విధించే అవకాశం ఉండటంతో జీఎస్టీ ఆదాయం మరింత పెరగనున్నది.