For Money

Business News

బియ్యం ధరలకు రెక్కలు!

ఈసారి రుతుపవనాలు బాగున్నా వరి దిగుబడి తగ్గే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు ప్రపంచ ఆహార ధాన్యాల కొరత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి సాధారణ బియ్యం దిగుమతి చేసుకునే దేశాలు తొందరపడుతున్నాయి. ఇటీవల గోధుమల ఎగుమతికి అనుమతి ఇచ్చి… వెంటనే భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎందుకంటే దేశీయంగా గోధుమల సంక్షోభం రాకూడదని. అయితే భారత్‌ నుంచి సాధారణ బియ్యం (నాన్‌ బాస్మతి) దిగుమతి చేసుకునే దేశాలు ముందు జాగ్రత్త పడుతున్నాయి. బియ్యం ఎగుమతులపై కూడా భారత్‌ నిషేధం విధించే అవకాశం ఉన్నందున.. చాలా దేశాలు వెంటనే దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. గత అయదు రోజుల్లోనే 10 శాతం పైగా ధరలు పెరిగినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. సాధారణంగా సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో బంగ్లాదేశ్‌ బియ్యాన్ని భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈనెల 22వ తేదీన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం బియ్యం దిగుమతులపై సుంకాన్ని 62.5 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. దీంతో బంగ్లా కంపెనీలు భారత్ నుంచి బియ్యం దిగుమతులను పెంచాయి. అక్టోబర్‌ 31వ తేదీ వరకు ఈ నోటిఫికేషన్‌ అమల్లో ఉంటుందని బంగ్లాదేశ్‌ పేర్కొన్నా… బంగ్లా కంపెనీలు ఇప్పటి నుంచే బియ్యం దిగుమతి చేసుకోవడంలో ఓ వ్యూహం ఉందని వ్యాపారవేత్తలు అంటున్నారు. రుతుపవనాలు ఈసారి ఊహించినట్లుగా లేవని… ఒకవేళ వర్షాభావం కారణంగా భారత్‌లో వరి ఉత్పత్తి తగ్గితే తమక ఇబ్బంది ఉంటుందని బంగ్లాదేశ్‌ భావిస్తోంది. మున్ముందు బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించవచ్చని అనుమానిస్తోంది. దీంతో ముందుగానే దిగుమతులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. గత అయిదు రోజుల్లోనే టన్ను బియ్యం ధర 350 డాలర్ల నుంచి 360 డాలర్లకు పెరిగినట్లు రైస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు అంటున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 480 కోట్ల డాలర్ల విలువైన నాన్‌ బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. 2021-11లో ఈ ఎగుమతుల విలువ 611 కోట్ల డాలర్లకు చేరింది. పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్‌ నుంచి బంగ్లాదేశ్‌ బియ్యం దిగుమతి చేసుకుంటుంది. ఈ రాష్ట్రాల్లో సాధారణ రకం బియ్యం ధర 20 శాతం పెరిగినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది.