For Money

Business News

ఈ షేర్‌లో ఏం జరుగుతోంది?

ఈనెల 7వ తేదీన దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)ని పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ టేకోవర్‌కు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బ్రాంచ్‌ అనుమతించింది. 8వ తేదీ ఉదయం ఈ షేర్‌ పది శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు చేరింది. జూన్‌ 2వ తేదీ నుంచి మార్కెట్‌ను కొందరు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అప్పటికే ఈ షేర్‌ 27 శాతం పెరిగింది. విచిత్రమేమిటంటే ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. పైగా దీవాన్‌ను టేకోవర్‌ చేస్తే ఆ షేర్‌ను పిరమల్‌ గ్రూప్‌ డీలిస్ట్‌ చేస్తుందని కూడా అనలిస్టులు హెచ్చరిస్తూ వచ్చారు. ఈనెల 8వ తేదీన ఈ షేర్‌ రూ. 22.85కి చేరింది. ఈలోగా కంపెనీ కూడా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు డీలిస్టింగ్‌ సమాచారం ఇచ్చింది. రుచి సోయా, అలోక్ ఇండస్ట్రీస్‌ల మాదిరిగా ఈ కంపెనీ షేర్‌ కూడా పెరుగుతుందని ఆశపడినవారు అడ్డంగా బుక్కయిపోయారు. విచిత్రేమేమిటంటే ఎన్‌సీఎల్‌టీ ఆమోదం పొందిన తరవాత కూడా ఈ టేకోవర్‌లోని కీలక అంశాలను దీవాన్‌, పిరమల్‌ గ్రూప్‌ వెల్లడించడం లేదు. ముఖ్యంగా దీవాన్‌ హౌసింగ్‌ షేర్లను డీలిస్ట్‌ చేస్తే ఉన్న ఇన్వెస్టర్లకు ఏమైనా ఇస్తారా? లేదా మార్కెట్‌ అనుకుంటున్నట్లు దీవాన్‌ హౌసింగ్‌ షేర్‌ను జీరో చేసి కొంటున్నారా? మార్కెట్‌ అనలిస్టులు మాత్రం దీవాన్‌-పిరమల్‌ గ్రూప్‌ ఒప్పందంలో దీవాన్‌ షేర్ల విలువను జీరో చేసి కొనేలా షరతు ఉందని చెబుతున్నారు. దీనిపై రెండు కంపెనీలు మాట్లాడటం లేదు. ఇపుడు డీలిస్టింగ్‌ జీరోకు చేస్తారనేసరికి ఇన్వెస్టర్లలో టెన్షన్‌ మొదలైంది. షేర్లను అమ్ముతున్నారు. ఇవాళ ఈ షేర్‌ పది శాతం నష్టంతో రూ. 18.55లకు పడింది. ఈ షేర్‌ నిజంగానే జీరో అయ్యే పక్షంలో ఈ ధర వద్ద కూడా ఎవరు కొంటున్నట్లు? డీల్‌లో కండీషన్‌ బహిరంగ పర్చకపోవడం వల్ల ఈ ఇన్వెస్టర్లు కూడా బుక్‌ అవుతున్నట్లే కదా? ఎందుకంటే ఇవాళ ఒక్క ఎన్ఎస్‌ఈలోనే 17,57,826 షేర్లు ట్రేడయ్యాయి. అన్నీ డెలివరీ తీసుకున్న షేర్లే. ఈ ధర వద్ద అమ్మడానికి ఇంకా 1,16,467 షేర్రలు ఉన్నాయి ఎన్ఎస్‌ఈలో. కొనుగోలు చేస్తున్నవారు రిస్క్‌ తీసుకున్నట్లే… మరి ఎక్స్ఛేంజీలకు బాధ్యత లేదా? ఒప్పంద వివరాలు బయట పెట్టమని చెప్పలేవా?