For Money

Business News

డిష్‌ టీవీ నుంచి జీ ప్రమోటర్లు వైదొలగాల్సిందే

డిష్‌ టీవీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం కంపెనీ వ్యవహారాలు చూస్తున్న డైరెక్టర్ల బోర్డు మొత్తాన్ని వెళ్ళిపోవాల్సిందిగా ఎస్‌ బ్యాంక్‌ నోటీసు ఇచ్చింది. డిష్‌టీవీకి ఇపుడు జవహర్‌ లాల్‌ గోయెల్‌ (ఈయన సుభాష్‌ చంద్ర సోదరుడు) మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నాడు. ఆయనతో పాటు కంపెనీ డైరెక్టర్లు రష్మి అగర్వాల్‌, శంకర్‌ అగర్వాల్‌, అశోక్‌ మథాయ్‌ కురియన్‌, భగవాన్‌ దాస్‌ నారంగ్‌లను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఎస్‌ బ్యాంక్‌ కోరింది. ఎస్‌బీఐతో పాటు పలు బ్యాంకులు కలిసి ఎస్‌ బ్యాంక్‌లో 25.63 శాతం వాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కంపెనీలో ఎస్‌ బ్యాంక్‌ అతి పెద్ద వాటాదారు. జవహర్‌ లాల్‌ గోయెల్‌ను కంపెనీ ఛైర్మన్‌గా కూడా రాజీనామా చేయాలి కోరింది. కేవలం ఆరు శాతం వాటా ఉన్న గోయెల్‌ గ్రూప్‌… అతి పెద్ద వాటాదారుతో సంప్రదించకుండా నిధుల సమీకరణ ప్రణాళికను సిద్ధం చేశారని ఎస్‌ బ్యాంక్‌ పేర్కొంది. రూ. 1000 కోట్లను రైట్స్‌ ఇష్యూ ద్వారా సమీకరించాలని ప్రతిపాదించారని, పరోక్షంగా తమ వాటాను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నమని ఎస్‌బ్యాంక్‌ ఆరోపించింది. ఎస్‌ బ్యాంక్‌ నోటీసు ఇచ్చిన తరవాత ఇవాళ స్టాక్‌ మార్కెట్‌లో డిష్‌ టీవీ షేర్‌ ఒకదశలో 20 శాతం దాకా పెరిగింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 12 శాతం లాభంతో రూ. 15.40 వద్ద ముగిసింది.