For Money

Business News

బాటాలో ఏం జరుగుతోంది?

చాలా మంది అనలిస్టుల డార్లింగ్‌గా ఉన్న బాటా ఇండియా షేర్లలో భారీ ఎత్తున హెచ్చుతగ్గులు రావడం మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఉన్న ఈ షేర్‌ ఇటీవల రూ. 2000ను తాకింది. జులై నెల చివర్లో రూ. 1775ని తాకిన ఈ షేర్‌ ఫలితాల ముందు బాగా పెరిగింది. ఫలితాలు అంతంత మాత్రమే ఉండటంతో షేర్‌ ధరలు స్వల్ప కరెక్షన్‌ వచ్చింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో వచ్చే త్రైమాసికంలో కంపెనీ ఫలితాలు బాగుంటాయనే వార్తలు వస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటి వరకు బాటా షేర్‌దే అగ్రస్థానంగా ఉంది. రిలాక్సో షేర్‌ ఉన్నా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే మెట్రో బ్రాండ్స్‌, క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ షేర్లు లిస్ట్‌ కావడంతో ఈ రంగంలో కూడా పోటీ తీవ్రమైంది. ముఖ్యంగా రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న మెట్రో బ్రాండ్స్‌ అద్భుత ఫలితాలు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆ కౌంటర్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. రాకేష్‌ మృతి తరవాత ఈ కౌంటర్‌లో వచ్చిన ఒత్తిడి కేవలం ఒక సెషన్‌కే పరిమితమైంది. దిగువ స్థాయి నుంచి మెట్రో బ్రాండ్‌ కోలుకుంది. ఈలోగా బాటా షేర్లకు రెకమెండేషన్స్‌ మార్కెట్‌లో పెరిగాయి. ఈ షేర్‌ తాజా టార్గెట్ రూ.2200గా పేర్కొన్నారు. అయితే నిన్న రూ. 1971 వద్ద ఉన్న ఈ షేర్‌ ఇవాళ ఉదయం రూ. 1891ని తాకింది. అంటే రూ. 80 తగ్గిందన్నమాట. అక్కడి నుంచికోలుకుని 1970కి చేరినా.. అక్కడ నిలబడలేకపోతోంది. ఇపుడు రూ.1930 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు మెట్రో బ్రాండ్స్‌ షేర్‌ రూ. 8 పెరిగి రూ. 853 వద్ద స్థిరంగా ఉంది. మొన్నటి దాకా రూ. 500 ప్రాంతంలో ఉన్న ఈ షేర్‌ ఇపుడు రూ. 850పైన నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. క్యాంపస్ యాక్టివ్‌వేర్‌ షేర్‌ను కూడా ఇపుడు బ్రోకరేజి సంస్థలు రెకమెండ్‌ చేస్తున్నాయి. మొత్తానికి ఈ విభాగంలో బాటా ఇండియాకు ఇన్నాళ్ళు తిరుగులేని ఆధిపత్యం ఉండేది. ఇపుడు ఆ కంపెనీకి గట్టి పోటీ ఎదురవుతోంది.