ఈడీకి బదిలీ కానున్న తెలంగాణ ఎఫ్‌ఐఆర్‌లు
2020లో సంచలనం రేపిన టీఆర్‌పీ రేటింగ్‌కు సంబంధించి కీలక ఘటనలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ కేసును వాస్తవంగా ముంబై పోలీసులు నమోదు చేశారు. సీబీఐ కూడా దర్యాప్తు చేఉసింది. ఫైనల్ ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చేతికి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించిన తొలి చార్జిషీటు, అనుబంధ చార్జిషీటులను పరిశీలించిన ఈడీ.. గత వారం మరో చార్జిషీటును దాఖలు చేస్తూ… ఈకేసు నుంచి రిపబ్లిక్ టీవీ, ఆర్. భారత్, అర్నబ్ గోస్వామితో పాటు ఈ ఛానల్స్‌కు చెందిన ఉద్యోగులను మినహాయించింది. ఇదే సమయంలో దేశంలోని నంబర్ వన్ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఛానల్ అక్రమాలకు పాల్పడిందని పేర్కొంది. టామ్ మీటర్లు ఉన్న ఇంటి యజమానులకు టైమ్స్ నౌతో పాటు ఇండియా టుడే, న్యూస్ నేషన్ ఛానల్స్ ముడుపులు ఇచ్చాయని పేర్కొంది. (ఈ ఆరోపణలు మీడియా సంస్థలు ఖండించాయి) ఇక మిగిలినదంతా సేమ్ టు సేమ్. టీఆర్‌పీ రేటింగ్ స్కామ్ జరిగిన మాట నిజమేనని స్పష్టం చేస్తూ తాజాగా 16 మందిపై కేసు నమోదు చేసింది. టీఆర్‌పీ స్కామ్‌పై బార్క్ (Broadcast Research Audience Council) ఫోరెన్సిక్ ఆడిట్‌కు ARCPL (Acquisory Risk Consulting Pvt Ltd) నియమించింది. ఈ ఆడిట్ నివేదిక ఆధారంగా ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని ఈడీ నియమించిన చోక్సీ అండ్ చోక్సి అనే ఆడిట్ సంస్థతో మళ్ళీ ఆడిట్ చేయించారు. మళ్ళీ నిందితులను విచారించాక…తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. ఈ చార్జీషీటులో కొన్ని ప్రధాన అంశాలను పేర్కొంటూ 16 మందిని నిందితులుగా చేర్చింది. వీటిలో ఫక్త్ మరాఠి, మహా మూవీస్, బాక్స్ సినిమా యజమానులు, వారి ఉద్యోగులతో పాటు ఇతరులు ఉన్నారు. ఈ చార్జిషీటులో ఈ మరో కీలక అంశం… ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తు ముంబై కేంద్రంగా సాగిందని… కాని టామ్ మీటర్ల ట్యాంపరింగ్ దేశంలో అనేక నగరాల్లో జరిగిందని పేర్కొంది. ఈ ఆరోపణలతో వివిధ రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లో నమోదు అయ్యాయని పేర్కొంది. ఆయా ఎఫ్‌ఐఆర్‌లను తమకు బదిలీ చేయాల్సిందిగా ఆయా రాష్ట్రాల పోలీసులు ఆదేశిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. వీటిలో ఏపీకి సంబంధించి కర్నూలులో ఒక కేసు నమోదు అయింది. 2019 ఫిబ్రవరిలో హన్సా రీసెర్చి గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫిర్యాదు చేసింది. నిందితుల వివరాలు వెల్లడి కాలేదు. ఇక తెలంగాణలో 2018లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. మార్చిలో హుజూరాబాద్‌లో, మేలో హైదరాబాద్‌లో, జులైలో సంగారెడ్డి, అక్టోబర్‌లో హసన్ (?)లో కేసులు నమోదు అయ్యాయి. జీడీఏ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసింది. మూడు కేసుల్లో నిందితులు హన్సా రీసెర్చి గ్రూప్ కాగా, ఒక కేసులో తమ సొంత ఉద్యోగిని నిందితునిగా జీడీఏ పేర్కొంది. బెంగళూరులో కూడా రెండు కేసులు ఉన్నాయి. (కన్నడ టీవీ9 కూడా ట్యాంపరింగ్ ఆరోపణలు ఉన్నాయి) సో.. ఈకేసులన్నీ ఇపుడు ఈడీ చేతికి వెళ్ళనున్నాయి.
తెలుగు ఛానల్స్‌లో దడ
తాజా చార్జిషీటు అత్యంత కీలక విషయమేమిటంటే.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఛానల్స్ రేటింగ్ తారుమారు చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలినట్లు ఈడీ స్పష్టంగా చెప్పడం, ఎఫ్‌ఐఆర్‌లను తనకు బదిలీ చేయించుకోవడం. వీటితో పాటు 2016 నుంచి 2019 వరకు దక్షిణాది ఛానల్స్ ఇంచార్జి/ రేటింగ్ వ్యవహారాలను చూసిన వెంకట్ సుజిత్ సమ్రాట్ (వీఎస్‌ఎస్) పేరును ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన ARCPL నివేదికలో ఉందని ఈడీ స్పష్టం చేయడం. అతనికి వివిధ ఛానల్స్ మధ్య జరిగిన ఈ మెయిల్స్‌ను ఈ ఆడిట్ సంస్థ సేకరించింది. తెలుగు న్యూస్ ఛానల్స్ విషయంలో 2017 నుంచి 2019 మధ్య కాలంలో జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది. సరిగ్గా తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగు న్యూస్ ఛానల్స్‌కు సంబంధించిన ట్యామ్ రేటింగ్‌ను భారీగా మార్చారు. ఇదే సమయంలో ఎక్కడో ఉన్న ఓ టీవీ ఛానల్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక వారాలు టాప్ 3లో ఉంటూ వచ్చింది. కొన్ని వారాలు టాప్ వన్‌గా కూడా వచ్చింది.
ఈ మెయిల్స్ నిజమే..
తెలుగులో టీవీ9 ఛానల్ రేటింగ్‌ను ఎక్కువగా ఉంచడం కోసం ఐన్యూస్ GRPs నుంచి 72 నుంచి 8కి తగ్గించమని సౌత్ ఇంచార్జి వెంకట్ సుజిత్ సమ్రాట్ రాసిన ఈమెయిల్ ఇప్పటికే బయటికి వచ్చింది. అలాగే పెద్ద ఛానల్స్ రేటింగ్స్ ఎక్కువగా ఉండేందుకు ఐన్యూస్‌తో పాటు ఏపీ 24X7 న్యూస్ ఛానల్ రేటింగ్‌ను తగ్గించమని వెంకట్ కోరారు. టీవీ5, ఏబీఎన్ ఛానల్స్ రేటింగ్‌ను తగ్గించమనే మెయిల్స్ కూడా బయటపడ్డాయి. వీటితో పాటు టీవీ5 కన్నడ ఛానల్స్‌ను తగ్గించమని కోరిన మెయిల్స్ ఆడిట్ సంస్థకు చేరాయి. కర్ణాటకలో టీవీ9 కన్నడ ఛానల్ రేటింగ్ పెంచేందుకు ఈ ప్రయత్నం జరిగినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ మెయిల్స్‌పై వివరణ కోరగా… కోర్టు కేసు నడుస్తున్నందున తాము స్పందించలేమని బార్క్ అప్పట్లో చెప్పింది. ఇపుడు ఆడిట్ రిపోర్ట్ ఈడీ చేతికి వచ్చింది. ఆడిట్ రిపోర్ట్ వివరాలను ఈడీనే బయట పెట్టింది. ముంబైలో ఏయే ఇంటికి ఏయే ఛానల్ ఎంత ముట్ట జెప్పింది… బ్యాంకు వివరాలు, వ్యక్తుల పేర్లతో సహా చార్జిషీటులో బయటపెట్టింది. మరి తెలుగు న్యూస్ ఛానల్స్ విషయంలో కూడా ఈ వివరాలన్నీ బయటికి వస్తాయా? అన్నది చూడాలి. నిందితులను విచారిస్తుందా? ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.
తీవ్ర చర్యలు…
తాజా చార్జిషీటు ప్రకారం చూస్తే కేవలం ఒక ఏడాదిలోనే ఆర్జించిన సంపదనను…ఆక్రమ ఆర్జన అంటూ మూడు ఛానల్స్‌కు చెందిన రూ.32 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. నవంబర్ 2019 నుంచి 2020 సెప్టెంబర్ వరకు రేటింగ్‌లు మార్చడం ద్వారా ఫక్త్ మరాఠి రూ.29.66 కోట్లు, మహామూవీస్ రూ.15.03 కోట్లు, బాక్స్ టీవీ రూ. 2.06 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు ఈడీ తేల్చింది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద వీటికి చెందిన రూ. 32.56 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. అడ్జుకేటింగ్ అథారిటీ కూడా దీన్ని ధృవీకరించడంతో… ఈ జప్తు విషయంలో ఇక తిరుగులేదు. మరి తెలుగు ఛానల్స్‌లో మూడు సంవత్సరాల పాటు రేటింగ్ స్కామ్ జరిగినట్లు ఆడిట్ నివేదికను పేర్కొంటూ ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కొంది. మరి అక్రమ సంపాదనను ఈడీ బయట పెడుతుందా చూడాలి.
కొసమెరుపు: టీఆర్‌పీ రేటింగ్ స్కామ్‌లో ఆరోపణలు వచ్చింది ఒకరిపై. ఆ ఛానల్‌ను ‘నిర్మా’ సబ్బుతో కడిగేశారు. కొత్తవారికి బురద అంటించారు. మరి తెలుగులో నిర్మా సబ్బు ఎవరికో.. మురికి ఎవరికో మరి?