For Money

Business News

క్రెడిట్‌ సూసే దివాలా తీయనుందా?

కరోనా సంక్షోభం, ద్రవ్యోల్బణ సంక్షోభం, ఇంధన ధరల సంక్షోభం… తాజాగా బ్యాంకింగ్‌ సంక్షోభం రానుందా అన్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ క్రెడిట్ సూసె దివాలా తీయనుందనే వదంతులు మార్కెట్‌ జోరుగా సాగుతున్నాయి. అలాంటి పరిస్థితి లేదని సంస్థ సీఈఓ అంటున్నా… ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. మనం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామని… సంస్థను పునర్‌వ్యవస్థీకరించే సమయం ఆసన్నమైందని… అందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని క్రెడిట్‌ సూసె సీఈఓ అల్‌రిచ్‌ కొరెన్నర్‌ సంస్థ ఉద్యోగులకు రాసిన మెసేజ్‌లో పేర్కొన్నారు. మార్కెట్‌లో వినిపిస్తున్న వదంతులను పట్టించుకోవద్దని ఆయన అన్నారు.
షేర్‌ ధర పతనం
మరో వైపు క్రెడిట్‌ సూసె షేర్‌ ధర మాత్రం క్రమంగా క్షీణిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో 14.90 డాలర్లు ఉన్న షేర్‌ క్రమంగా క్షీణిస్తూనే ఉంది. ఇపుడు 3.90 డాలర్లకు పడిపోయింది. బ్యాంక్‌, వెల్త్‌మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌లు బాగానే పని చేస్తున్నాయని.. అయితే ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగమే ఇబ్బందుల్లో ఉన్నట్లు బిజినెస్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. క్రెడిట్‌ సూసే తీవ్ర సంక్షోభంలో ఉందని బిజినెస్‌ న్యూస్‌ ఏజెన్సీలు వస్తున్నా.. ఈక్విటీ మార్కెట్స్‌లో మాత్రం దివాలా తీయనుందని వందతులు వస్తున్నాయి. ఈనెల 27వ తేదీ బ్యాంక్‌ తన ఫలితాలను ప్రకటించనుంది. బ్యాంక్‌ భవిష్యత్‌పై అనిశ్చితి ఉన్న మాట నిజమేనని బ్యాంక్‌ అంతర్గత వర్గాలతో పాటు బయటి వర్గాలు కూడా అంటున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ పేర్కొంది.