గ్రీన్కో ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కర్నూలు జిల్లాలో ప్రారంభించిన గ్రీన్ కో ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఇవాళ లేఖ రాశారు. ఈ లేఖలో మురళీధర్ పలు కీలక అంశాలను లేవనెత్తారు. వైకాపాకు చెందిన చలమలశెట్టి సునీల్ కుటుంబం ఆధ్వర్యంలోని గ్రీన్ కో సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టగా.. దావోస్లో కూడా ఈ కంపెనీతో జగన్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఏపీలో చేపట్టిన పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులపై మురళీధర్ లేఖలో ప్రస్తావించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ సర్కారు పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల చేపడుతోందని ఆరోపించారు. అనుమతలు లేని ఈ ప్రాజెక్టులను నిలువరించాలని ఆయన కోరారు.గ్రీన్ కో ప్రాజెక్టు కోసం కృష్ణా జలాలను వినియోగించరాదని తెలిపారు. కృష్ణా నుంచి ఇతర బేసిన్లకు జలాల తరలింపుపై ఆయన అభ్యంతరం తెలిపారు. జల విద్యుత్ కోసం కృష్ణా జలాల వినియోగంపైనా మురళీధర్ అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా ఏపీలోని పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల వివరాలు తెప్పించి ఇవ్వాలని కోరారు. అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతుల్లేని ప్రాజెక్టులను ఆపాలని ఆ లేఖలో ఆయన కేఆర్ఎంబీ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు.