For Money

Business News

జంషెడ్‌ జె ఇరానీ మృతి

‘స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన జంషేడ్‌ జె ఇరానీ (85) నిన్న రాత్రి మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జంషేడ్‌పూర్‌లోని టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు టాటా స్టీల్ యాజమాన్యం ప్రకటించింది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
టాటా స్టీల్‌తో జె.జె.ఇరానీకి 40 ఏళ్ల అనుబంధం ఉంది. 1936 జూన్‌ 2న నాగ్‌పూర్‌లో జీజీ ఇరానీ, ఖోర్షెడ్‌ ఇరానీ దంపతులకు జంషేడ్‌ ఇరానీ జన్మించారు. ఉన్నత చదువులు పూర్తయ్యాక ‘టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ (ఇప్పుడు టాటా స్టీల్‌)’లో ఆయన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి 1979లో జనరల్‌ మేనేజర్‌గా, 1985లో అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. తర్వాత 1988లో టాటా స్టీల్‌ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1992లో ఎండీగా బాధ్యతలు చేప్టటారు. 2011లో ఆయన రిటైరయ్యారు. అయినా టాటా గ్రూప్‌తో తన అనుబంధాన్ని కొనసాగించారు. ఇదే సమయంలో ఆయన టాటా సన్స్‌, టాటా మోటార్స్‌, టాటా టెలీసర్వీసెస్‌ సంస్థలకూ ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2007లో పద్మభూషణ్‌తో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.