For Money

Business News

నేటి నుండి పసిడి బాండ్ల విక్రయం

సావరీన్‌ గోల్డ్‌ బాండ్ల (ఎస్‌జీబీ) అమ్మకం ఇవాళ ప్రారంభం కానుంది. అయిదు రోజుల పాటు ఇది కొనసాగనుంది. ఈ బాండ్‌ ఇష్యూ ధరను గ్రాముకు రూ. 5,091గా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్‌ బాండ్లను అమ్మండి ఇదే మొదటిసారి. రెండవ విడత ఆగస్టు 22-ఆగస్టు 26 మధ్య విక్రయిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌ విధానంలో చెల్లిస్తే గ్రాముకు రూ. 50 చొప్పున డిస్కౌంటు లభిస్తుంది.
2015 నవంబర్‌లో ఈ స్కీమ్‌ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ స్కీము ద్వారా ప్రభుత్వం రూ. 38,693 కోట్లు (సుమారు 90 టన్నుల బంగారం విలువ) బంగారాన్ని సమీకరించింది. కోవిడ్‌ వ్యాప్తి సమయంలో (2020–21, 2021–22) ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఏకంగా రూ. 29,040 కోట్ల మేర బాండ్లను కొనుగోలు చేశారు. ఈ స్కీము ద్వారా ఇప్పటిదాకా ప్రభుత్వం సమీకరించిన నిధుల్లో ఇది దాదాపు 75 శాతానికి సమానం కావడం గమనార్హం. సావరిన్ గోల్డ్ బాండ్‌లు నివాసితులు, హిందూ అవిభక్త కుటుంబాలు(HUFలు), ట్రస్ట్‌లు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే విక్రయిస్తారు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) రోజూ 999 స్వచ్ఛత గల స్టాండర్డ్‌ బంగారం ధరలు ప్రచురిస్తుంది. అలా ప్రచురించిన మూడు రోజుల ముగింపు ధరకు సగటు ధరకు ఈ బాండ్లను విక్రయిస్తారు.