For Money

Business News

ప్యాకేజీ ఫుడ్‌పై కొత్త బాదుడు?

అత్యవసర వస్తువులు ముఖ్యంగా ప్యాకేజ్‌లో అమ్మే ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఈనెలాఖరులో సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్‌లో జీఎస్టీ స్లాబులను మార్చే అవకాశముంది. ఇపుడు అయిదు శాతం కేటగిరిలో ఉన్న అన్ని వస్తువులను 8 శాతం కేటగిరి వస్తువులతో కలిపాలన్న ప్రతిపాదన చర్చకు రానుంది. ఇపుడు జీఎస్టీలో పన్నులు నాలుగు స్లాబుల్లో వేస్తున్నారు. దీన్ని హేతుబద్ధీకరణ అనే ముసుగులో జీఎస్టీ భారం పెంచేందుకు మంత్రుల కమిటీ వేశారు. కేటగరీలను నాలుగు నుంచి 3కు తగ్గించాలని ఈ కమిటీ సిఫారసు చేయనున్నట్లు సమాచారం. మార్చిన తరవాత ఇపుడున్న నాలుగో కేటగిరి కాస్త మూడో కేటగిరి కిందికి వస్తుంది. పొగాకు ఉత్పత్తులు, విలాస వస్తువులు ఈ కేటగిరిలో ఉంటాయి. వీటిపై 28 శాతం జీఎస్టీ వేస్తున్నారు. ఇవి పోగా ఇపుడున్న స్లాబులు 5శాతం, 12 శాతం 18 శాతం. 5 శాతం జీఎస్టీని 8 శాతానికి పెంచి రెండో స్లాబు చేస్తారు. అలాగే 12 శాతం స్లాబులో ఉన్న వస్తువులను 18 శాతం జీఎస్టీలోకి తీసుకెళారు. అంటే విలాస వస్తువులు మినహా మిగిలిన అన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీ 8 శాతం లేదా 18 శాతం ఉంటుందన్నమాట.
భారీగా ఆదాయం
స్లాబులను ఈ విధంగా మారిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరగనుంది. అత్యవసర వస్తువులపై జీఎస్టీని 5 శాతంనుంచి 8 శాతానికి పెంచడం వల్ల ఏటా అదనంగా రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రుల బృందం నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ పన్ను శ్లాబును 1 శాతం పెంచితే అదనంగా రూ.50 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. అత్యధికంగా వాణిజ్య సేవలు, వస్తువులు 12 శాతం స్లాబుల్లో ఉన్నాయి. వీటిపై ఏకంగా ఆరు శాతం పెంచి, 18 శాతం చేస్తే… ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. మరి ఈ ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలు ఆమోదిస్తాయా లేదా అన్నది చూడాలి.