For Money

Business News

మిడిల్‌ క్లాస్‌పై ఆర్బీఐ పిడుగు

ఇప్పటి వరకు ధరలు పెరగడం వల్ల పేదలు నలిగి పోతుంటే… మిడిల్‌ క్లాస్‌ తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించింది. ఇపుడు ఆ ప్రమాదం వారి ఇంటికి వచ్చింది. దాదాపు ఏడాది నుంచి వడ్డీ రేట్లను పెంచకుండా… నెల రోజుల క్రితం కూడా దేశ పరిస్థితి సూపర్‌ అంటూ సర్టిఫికెట్‌ ఇచ్చిన ఆర్బీఐ ఇవాళ మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఒకటి… రెపో రేటును 0.4 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 4 శాతం నుంచి 4.4 శాతానికి చేరింది. ఒక రెండోది క్యాష్‌ రిజర్వ్‌ రేషియో (సీఆర్‌ఆర్‌)ను కూడా పెంచింది. దీనివల్ల బ్యాంకులు తమ వద్ద ఉన్న నిధుల నుంచి రూ. 87,000 కోట్లు అదనంగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సి ఉంటుంది. అంటే బ్యాంకుల వద్ద నిధుల లభ్యత తగ్గుతుంది. సో… తమ ఆదాయం పడిపోకుండా ఉండేందుకు… ఉన్న నిధులపై వడ్డీని పెంచి తమ ఆదాయాన్ని కాపాడుకుంటాయి బ్యాంకులు. సో… వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇక మార్కెట్‌లో రూ. 5 లక్షల కోట్ల లిక్విడిటీ ఉందని ఆర్బీఐ అంటోంది. మరి నిధులు కోటీశ్వరుల వద్ద ఉన్నాయి. కంపెనీల వద్ద ఉన్నాయి. ఒక్కసారిగా మూడు నిర్ణయాలను ఆర్బీఐ తీసుకోవడం ద్వారా మిడిల్‌ క్లాస్‌ నడ్డి విరిచింది. బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీని పెంచినా… రుణాలపై అధికంగా పెంచుతాయి. ద్రవ్యోల్బణం పెరగడానికి మూడు ప్రధాన కారణాలు… పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం, వంటనూనెల ధరలు పెరగడం, ఎరువుల ధరలు పెరగడం. పెట్రోల్, డీజిల్‌ పెరగడానికి కారణం ప్రభుత్వం. వంటనూనెల ధరల పెరుగుదలకు కారణం ఉక్రెయిన్‌ అంటున్నారే కాని.. అంతకుముందే వీటి ధరలు పెరిగాయి. పప్పు ధాన్యాలు, వంటనూనెలను నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తీసేసినపుడు జనం మాట్లాడలేదు. ఇపుడు నూనెలపై ప్రైవేట్‌ కంపెనీల గుత్తాధిపత్యం నెలకొంది. వీటిని నియంత్రించడంలో విఫలమైంది. ఇక చివరిది ఎరువులు. ఎరువుల సబ్సిడీ పేరుతో వేల కోట్ల రూపాయల నగదును కేంద్రం కంపెనీలకు బదిలీ చేస్తోంది. గత ప్రభుత్వాల మాదిరి ఎరువల ధరలపై నియంత్రణ లేకుండా పోయింది…. ఇప్పటి వరకు స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో కలలు కంటున్న మిడిల్‌ క్లాస్‌కు అసలు పరీక్ష ప్రారంభమైందనే చెప్పాలి.