For Money

Business News

దక్కన్‌ క్రానికల్‌పై సెబీ కొరడా

దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) ప్రమోటర్లు, మరికొందరిపై క్యాపిటల్‌ మార్కెట్స్‌ నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. మోసపూరిత కార్యకలాపాలు, తప్పుడు సమాచారం, నిబంధనల ఉల్లంఘనలకుగాను రెండేండ్ల వరకు సెక్యూరిటీల మార్కెట్‌లో ప్రవేశించకుండా నిషేధం విధించింది. కంపెనీతో పాటు సంబంధిత వ్యక్తులపై రూ.8.2 కోట్ల జరిమానాలనూ వేసింది. ఆర్థిక సంవత్సరాలు 2008-09 నుంచి 2011-12 వరకు తమ ఆర్థిక ప్రకటనల్లో డీసీహెచ్‌ఎల్‌ రుణాలను తక్కువగా చూపిందని, మోసపూరితంగా వ్యవహరించిందని సెబీ పేర్కొంది. ఈ క్రమంలోనే డీసీహెచ్‌ఎల్‌పై రూ.4 కోట్లు, ప్రమోటర్లు టీ వెంకట్రామిరెడ్డి, టీ వినాయక్‌ రవిరెడ్డిలతోపాటు పీకే అయ్యర్‌పై రూ.1.30 కోట్ల చొప్పున జరిమానాలు వేసింది. అలాగే ఎన్‌ కృష్ణన్‌కు రూ.20 లక్షలు, వీ శంకర్‌కు రూ.10 లక్షల ఫైన్‌ విధించింది. డెక్కన్‌ క్రానికల్‌పై వచ్చిన వివిధ ఆరోపణలపై 2011 అక్టోబర్‌ నుంచి 2012 డిసెంబర్‌ వరకు కంపెనీ కార్యకలాపాలను సెబీ విచారించింది. రుణాలు, వడ్డీ చెల్లింపులు, ఇతర చార్జీల సంబంధించి పలు వివరాలను తమ అకౌంట్లలో పేర్కొనలేదని తమ విచారణలో తేలినట్టు సెబీ పేర్కొంది.