For Money

Business News

ఈ ఏడాదే జియో, రీటైల్‌ పబ్లిక్‌ ఇష్యూ?

స్టాక్‌ మార్కెట్‌లో అదానీ దూసుకుపోతుండటంతో.. రిలయన్స్‌ గ్రూప్‌ జూలు విదుల్చుతోంది. ఈసారి ఏకంగా రెండు కంపెనీలను పబ్లిక్‌ ఇష్యూకు తేవాలని భావిస్తోంది. రిలయన్స్‌ జియోతో పాటు రిలియన్స్‌ రీటైల్‌ను క్యాపిటల్‌ మార్కెట్‌లోలిస్ట్‌ చేయాలని భావిస్తోంది. వచ్చే వాటాదారుల సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేస్తారని ద హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. ఒక్కో పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ. 50,000 కోట్ల నుంచి రూ. 70,000 కోట్లను రిలయన్స్‌ సమీకరించవచ్చని పత్రిక పేర్కొంది. ఈ ఆఫర్‌ ద్వారా ప్రమోటర్ల వాటాలో కనీసం పది శాతం వాటాను ముకేష్‌ అంబానీ విక్రయించే అవకాశముంది. ఈ రెండు కంపెనీలు భారత స్టాక్‌ మార్కెట్‌తో పాటు అమెరికాలోని నాస్‌డాక్‌ ఎక్స్ఛేంజీలో కూడా ఒకేసారి లిస్ట్‌ అయ్యే అవకాశముందని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఈ రెండు కంపెనీల ఐపీఓలు మార్కెట్‌లోకి వస్తాయని తెలుస్తోంది. తొలుత రిలయన్స్‌ రీటైల్‌, తరవాత రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఉండే అవకాశముంది. రిలయన్స్‌ రీటైల్‌ వ్యాల్యూయేషన్‌ రూ. 8 లక్షల కోట్లు దాకా ఉండొచ్చని, అదే జియో ప్లాట్‌ఫామ్స్‌ వ్యాల్యూయేషన్‌ కూడా రూ. 7.5 లక్షల కోట్లు ఉండే అవకాశముందని భావిస్తున్నారు.