For Money

Business News

ఇళ్ల అమ్మకాల్లో కొనసాగిన జోష్‌

ప్రస్తుత సంవత్సరం ప్రథమార్ధం (జనవరి-జూన్‌)లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 60 శాతం పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్‌ కంపెనీ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. ఈ ఆరు నెలల్లో 1,58,705 యూనిట్లకు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు అమ్మినట్లు పేర్కొంది. ప్రథమార్ధం అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే గత 9 సంవత్సరాలలో ఇవే రికార్డు స్థాయి అమ్మకాలని ఆ సంస్థ వెల్లడించింది. గత ఏడాది అంటే (2020-2021)ఇదే కాలంలో 99,416 ఇళ్లు అమ్ముడుపోయాయి. ‘ఇండియా రియల్‌ ఎస్టేట్‌: రెసిడెన్షియల్‌ అండ్‌ ఆఫీస్‌ మార్కెట్‌ హెచ్‌1 2022’ పేరుతో నైట్‌ ఫ్రాంక్‌ తాజా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2013 ప్రథమార్ధం లో అర్ధసంవత్సర కాలంలో గరిష్ఠ అమ్మకాల రికార్డు నమోదయింది. అప్పుడు ఏకంగా 1,85,577 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఆ తరవాత ఆ స్థాయిలో అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి. ధరలు పెరిగినా అమ్మకాల్లో జోష్‌ కొనసాగుతోందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ శిశిర్‌ బైజాల్‌ అన్నారు. ఇటీవల ఫ్లాట్స్‌ ధరలు 3-9 శాతం పెరిగినట్లు ఆయన వెల్లడించారు. అన్ని నగరాల మార్కెట్లలో ధరలు పెరగడం 2015 జూలై-డిసెంబరు తర్వాత మళ్లీ ఇదే మొదటిసారని చెప్పారు. అమ్మకాలు మరింత పెరగడంతో గడిచిన ఆరు నెలల కాలానికి గృహ నిల్వలు 4,40,117 యూనిట్లకు తగ్గాయి. ఈ ఏడాది ప్రథమార్ధానికి కార్యాలయ స్థలాల లీజులు కూడా రెండు రెట్లు పెరిగి 2.53 కోట్ల చదరపు అడుగులకు చేరినట్లు నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది.ఇదే సమయంలో హైదరాబాద్‌, ముంబై, ఎన్‌సీఆర్‌లో కూడా అద్దెలు స్వల్పంగా పెరిగాయని వెల్లడించింది.