For Money

Business News

దుమ్ము రేపిన రెయిన్‌బో హాస్పిటల్‌ షేర్‌

నిఫ్టి ఏడాది నుంచి పడకేసింది. గత ఏడాది నంబర్‌లో ఏ స్థాయిలో ఉందో…ఇపుడు అంతకన్నా తక్కువగా ఉంది. కాని ఈ ఏడాదిలో కొన్ని షేర్లు అద్భుతంగా రాణించాయి. ముఖ్యంగా లిస్టింగ్‌ సమయంలో ఆదరణ లేక… ఆఫర్‌ ధర నుంచి 20 శాతంపైగా పడిన రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌ షేర్‌ మార్కెట్‌ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచేలా దూసుకుపోయింది. ఈ ఏడాది మేలో రూ. 542 చొప్పున ఈ హాస్పిటల్‌ షేర్లను జారీ చేసింది. మే 10న లిస్టయిన వెంటనే షేర్‌ ముఖ విలువకన్నా దిగువకు పడింది. జూన్‌ నెలలో రూ. 410ని తాకింది. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా గత త్రైమాసిక ఫలితాల తరవాత షేర్‌ టాప్‌ గేర్‌లోకి వచ్చింది. నిన్న ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు ఈ షేర్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది. నిన్న ఉదయం రూ. 704 ఉన్న ఈ షేర్‌ ఇవాళ రూ. 864.40ని తాకింది. దాదాపు 20 శాతాన్ని టచ్‌ చేసిన షేర్‌ క్లోజింగ్‌లో రూ. 808.25 వద్ద ముగిసింది. హాస్పిటల్‌ పనితీరు మెరుగవడమేగాక… కంపెనీ విస్తరణ ప్రణాళిక కూడా మార్కెట్‌ను ఆకట్టుకుంటోంది. ఇపుడు ఆరు నగరాల్లో 15 హాస్పిటల్స్‌, మూడు క్లినిక్స్‌ ఉన్నాయి. మొత్తం 1555 బెడ్స్‌ ఉన్నాయి. రానున్న అయిదేళ్ళలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో పాటు ఏపీ, తమిళనాడులో ద్వితీయ శ్రేణి నగరాల్లోకి కూడా విస్తరిస్తామని కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ కంచర్ల వెల్లడించారు. ఈ అయిదేళ్ళలో మరో 1000 బెడ్స్‌ అదనంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో రెయిన్‌బో హాస్పిటల్‌ రూ. 313 కోట్ల టర్నోవర్‌పై రూ.61.5 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే హాస్పిటల్‌ ఆదాయం 36 శాతం పెరగ్గా, నికర లాభం 23 శాతం పెరిగింది.