For Money

Business News

ఆర్‌ఆర్‌ఆర్‌ ఎన్‌ఎఫ్‌టీల విడుదల

మల్టిప్లెక్స్ కంపెనీ పీవీఆర్‌ తమ వ్యాపారంలో కొత్త పోకడలకు శ్రీకారం చుడుతోంది. తొలిసారి ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాతతో డీల్‌ చేసుకుని.. తమ థియేటర్‌ పేర్లను పీవీఆర్‌ను కాస్త పీవీఆర్‌ఆర్‌ఆర్‌గా మార్చింది. మార్కెటింగ్‌ ఇదొక కొత్త ఎత్తుగడ. ఇపుడు ఆ నిర్మాతతో కలిసి ఎన్‌ఎఫ్‌టీ(నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌) మార్కెట్‌లోకి ప్రవేశించింది. తొలిసారిగా భారతీయ సినీ ప్రేక్షకులకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కలెక్షన్లను గెలుచుకునే అవకాశాన్ని పీవీఆర్‌ కల్పించింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌, పీవీఆర్‌ సంయుక్తంగా ఈ డిజిటల్‌ ఎన్‌ఎఫ్‌టీలను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనుంది. ఎస్‌ఎస్‌ రాజమాళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియా భట్‌ సంతకం చేసిన పోస్టర్లు, సినిమాలో వాడిన పలు వస్తువులతో సహా దాదాపు 300పైగా ఎన్‌ఎఫ్‌టీలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ డిజిటల్‌ కలెక్షన్లను పీవీఆర్‌ నిర్వహించే పోటిలో వీటిని ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చునని పీవీఆర్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి ఈ సినిమా ఆధారంగా ఆరు భిన్న రకాల ఎన్‌ఎఫ్‌టీలను ప్రవేశపెట్టింది. ఇందులో రెండు పోస్టర్స్‌. వీటిపై రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ఆలియా భట్‌ సంకాలు ఉంటాయి. మిగిలిన నాలుగు ప్రాప్స్‌. ఇవి సినిమాలో వాడిన బైక్‌, కాయిన్‌, రెండు ఆయుధాలు. ఈ ఆరు ఎన్‌ఎఫ్‌టీల నుంచి 50 కలెక్టబుల్స్‌ ఉంటాయి. దీంతో మొత్తం 300 ఎన్‌ఎఫ్‌టీలను మింట్‌ చేశారు. పాత చిత్రాలను కూడా ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్ల రూపంలో అందించేందుకు సిద్దమని పీవీఆర్‌ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజిలీ చెప్పారు. ఈ మేరకు హాలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన అయిదారు సినిమా స్టూడియోలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.