For Money

Business News

పే టీఎం దోపిడీ అంటే నమ్మలేదు…

జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌, వారన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హ్యాత్‌వే, జాక్‌ మాకు చెందిన అలీబాబా, యాంట్‌ కంపెనీలు పేటీఎం పతనాన్ని ఆపలేకపోయాయి. వివిధ రంగాల్లోకి విస్తరిస్తున్న పేమెంట్స్‌ కంపెనీ అయిన పేటీఎం స్టాక్‌ మార్కెట్‌లో ఇపుడున్న జోష్‌ను చక్కగా క్యాష్‌ చేసుకుంది. కంపెనీలో అతి తక్కువ ధరకు వాటా కొనుగోలు చేసిన ప్రమోటర్లు ఇష్యూ ద్వారా భారీ మొత్తాన్ని తీసుకున్నారు. (నైకా కూడా అంతే. ఇష్యూకు రెండు నెలల ముందు సొంత ఇన్వెస్టర్లు షేరు రూ.500లకు పొందారు) తీరా షేర్‌కు దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టరు తొలిరోజే లబోదిబోమన్నారు. ఏకంగా 27 శాతం నష్టంతో పేటీఎం షేర్‌ ఇవాళ క్లోజైంది. దేశ చరిత్రలో అతి పెద్ద ఇష్యూగా రికార్డు సృష్టించిన పేటీఎం… ఓపెనింగ్‌ రోజే ఈ స్థాయిలో పతనమైన అతి పెద్ద కంపెనీగా రికార్డు సృష్టించింది. పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ ఒక్కో షేర్‌ను రూ. 2150లకు కేటాయించగా…ఇవాళ ట్రేడింగ్‌ ముగిసేనాటికి రూ 27.25 శాతం క్షీణించిన షేరు విలువ రూ.1564వద్ద ముగిసింది.
దోచుకోవడమే లక్ష్యం…
ఇన్వెస్టర్ల నుంచి ఎంత వీలైతే అంత దోచుకునేందుకే ఈ పబ్లిక్ ఆఫర్‌ వచ్చింది. పే టీఎం షేర్‌… అనధికార మార్కెట్‌లో ఎపుడూ పెద్ద ప్రీమియంతో ట్రేడవలేదు. అంటే ఈ షేర్‌ ధర చాలా ఎక్కువ అని ఇష్యూ ప్రారంభం నుంచే మార్కెట్‌ భావిస్తోంది. ప్రమోటర్ల దోపిడీ అని ఎందుకు అనాలంటే… పేటీఎం ఐపీఓ ధర శ్రేణి రూ.2,080-2,150. అనధికార మార్కెట్‌లో తన షేర్లకు డిమాండ్‌ లేదని… ప్రమోటర్లకు తెలిసినా… కనీసం రూ. 2,080లకు అలాట్ చేయకుండా… గరిష్ఠ ధర రూ. 2,150 వద్ద అలాట్‌ చేశారు. అంటే దరఖాస్తు చేశారు కాబట్టి దోచుకోవడమే లక్ష్యంగా అలాట్‌ చేశారు. పబ్లిక్‌ ఆఫర్‌ రూ. 18,300 కోట్లయితే… అందులో రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు అమ్ముకున్నారు. జొమాటోను చూసి తొందరపడ్డ ఇన్వెస్టర్లు ఇలాళ చేతులు కాల్చుకున్నారు. జొమాటోకు భిన్నంగా పేటీఎం ఉన్న రంగంలో చాలా పోటీ ఉంది. భారీ నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ ఎపుడు లాభాల్లోకి వస్తుందో కంపెనీ కూడా చెప్పలేకపోయింది. పేటీఎం ఆఫర్‌లో జరిగిందేమిటంటే… అమెరికా ఫార్ములా. నష్టాల్లో కంపెనీకి అద్భుతమైన కల చూపించి… ప్రమోటర్లు భారీ ప్రీమియంతో తమ వాటాను అమ్ముకుని… కంపెనీని గాలికి వొదిలేయడం. మరి ప్రమోటర్‌ విజయ్‌ శర్మ ఏం చేస్తారో చూద్దాం.