For Money

Business News

రేపటి నుంచి 80 పైసలు చొప్పున

నిన్న, మొన్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను 80 పైసలు చొప్పున పెంచిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇవాళ పెంచలేదు. అయితే రేపటి నుంచి రోజుకు 80 పైసలు చొప్పున పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయని మనీ కంట్రోల్‌ డాట్‌ కామ్‌ పేర్కొంది. అధికారవర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీల రోజూ రీటైల్‌ ధరలను పెంచుతాయని పేర్కొంది. గత రెండు రోజుల్లో కేంద్రం ధరల పెంపు, ఆ మేరకు ఆయా రాష్ట్రాల వ్యాట్‌ పెంపుతో పెట్రోల్‌, డీజిల్ రేటు లీటరుకు రూ.2.40 చొప్పున పెరిగింది. ఎన్నికల సమయంలో రేట్లు పెంచకపోవడం వల్ల ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రూ.19000 కోట్లు నష్టపోయినట్లు మూడీస్‌ రేటింగ్‌ సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారల్‌ క్రూడ్‌ ధర ఒక డాలర్‌ పెరిగితే…లీటర్‌ పెట్రోల్‌ లేదా డీజిల్‌ రేటును 50 నుంచి 60 పైసలు కంపెనీలు పెంచాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రాల వాయింపు ఎలాగూ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్రూడ్‌ ధర సగటున 38 డాలర్లు పెరిగింది. అంటే లీటర్‌కు రూ. 19 నుంచి రూ.24 పెంచాల్సి ఉందన్నమాట. అయితే మొత్తాని ఒకేసారి కస్టమర్లపైన వేయకుండా క్రమంగా పెంచుతాయని తెలుస్తోంది. ఈలోగా క్రూడ్‌ ధర తగ్గితే కంపెనీలకు కాస్త ఉపశమనంగా ఉంటుంది.