For Money

Business News

డీజిల్‌పై లీటర్‌కు రూ.25 నష్టం

పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల పెంపును కేంద్రం ఆపివేయడంతో చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరుగుతూనే ఉన్నందున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌పై రూ.25 నష్టం వస్తోందని ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇలా ధరల పెంపును ఎంతో కాలం ఆపలేమని, కాని ఎప్పటి నుంచి ధరలు పెంచుతారో తెలియదని ఆయన అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డీజిల్‌ భారీ డిమాండ్‌ వస్తోందని అన్నారు. యూరప్‌తో పాటు సౌదీ అరేబియా దేశాలు కూడా డీజిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాయని తెలిపారు. మనదేశంలో డీజిల్‌ను కేవలం ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు మాత్రమే అమ్ముతున్నాయి. డీజిల్‌ అమ్మకాల వల్ల భారీ నష్టం వస్తున్నందున… ఆ కంపెనీలు అమ్మడం లేదు.
గ్యాస్‌ సబ్సిడీ ఎపుడో?
ఎల్‌పీపీ గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తేసిన విషయం తెలిసిందే. గ్యాస్‌ సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ. 5,500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినా… అది ప్రజలకు ప్రభుత్వం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. అంటే మొత్తం ధర జనం నుంచే వసూలు చేస్తున్నారన్నమాట. ఎల్‌పీజీ సబ్సిడీని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో తెలియదని, అది పూర్తిగా రాజకీయ నిర్ణయమని ఆ అధికారి చెప్పారు. ఎల్‌పీజీ ధర మరీ పెరిగితే అపుడు ప్రభుత్వం నుంచి తీసుకుంటామని చెప్పారు.