మాకు కనీసం చెప్పలేదు…ఎన్డీటీవీ
ఎన్డీటీవీలో వాటాను అమ్ముతున్నట్లు ప్రమోటర్లయిన తమకు గాని, తమ కంపెనీకి చెప్పలేదని ఎన్డీటీవీ తెలిపింది. ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్‌కు 29.18 శాతం వాటా ఉంది. ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్‌లకు చెందినదే ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ కంపెనీ. అయితే ఈ కంపెనీ 2009లో విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ. 400 కోట్ల రుణం తీసుకుంది. దీనికిగాను ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్‌లో 99.5 శాతం వాటాను ప్రణాయ్ రాయ్, ఆయన భార్యతాకట్టు పెట్టారు. 2019లో ఈ తాకట్టు గడువు పూర్తవడంతో తమకు జారీ చేసిన వారంట్లను షేర్లుగా ఇవాళ మార్చుకుంది విశ్వప్రధాన్. అరెండు రోజుల్లో షేర్లను తన పేరు మీద మార్చాలని పేర్కొంది. లా ఆర్ఆర్పీఎల్ హోల్డింగ్ ద్వారా విశ్వప్రధాన్కు ఎన్డీటీవీలో 29.18 శాతం వాటా ఉందన్నమాట. గత కొన్ని రోజులుగా ఎన్డీటీవీ షేర్ ధర భారీగా పెరగడంతో కంపెనీ నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీ వివరణ కోరింది. కంపెనీలో ఎలాంటి కీలక మార్పులు లేవని, వాటాలో కూడా ఎలాంటి తేడా లేదని నిన్ననే స్టాక్ ఎక్స్ఛేంజీకి ఎన్డీటీవీ తెలిపింది. ఇవాళ విశ్వప్రధాన్ను తాము పూర్తిగా కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ కంపెనీ (ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్) నుంచి నోటీసు వచ్చినట్లు ఎన్డీటీవీ స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలిపింది. వాటా విక్రయిస్తున్నట్లు తమకు మాట మాత్రంగా కూడా చెప్పలేదని పేర్కొంది. అయితే కంపెనీలో మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటన కూడా తమకు అందినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. అయితే అదానీ గ్రూప్ కంపెనీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ డీల్‌ను వ్యతిరేకిస్తున్నట్లు గాని… సమర్థిస్తున్నట్లుగాని ఎన్డీటీవీ చెప్పలేదు.