For Money

Business News

చివర్లో కోలుకున్నా…

అదానీ షేర్లలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. జాతీయవాదం ముసుగులో అవినీతి, అక్రమాలను దాచుకోవద్దంటూ హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన హెచ్చరికతో అదానీ వివరణ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించలేకపోయింది. దీంతో మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టి భారీ నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 17405ను తాకినా… చివర్లో వచ్చిన షార్ట్‌ కవరింగ్‌తో 17648ని వద్ద ముగిసింది. అయినా చాలా వరకు అదానీ షేర్లు నష్ఠాల్లో ముగిశాయి. కొన్ని అదానీ షేర్లు కోలుకునే ప్రయత్నం చేశాయి. వెరశి నిఫ్టి 44 పాయింట్ల లాభంతో క్లోజ్‌ కాగా, నిఫ్టి నెక్ట్స్‌ ఏకంగా ఒక శాతంపైగా నష్టంతో క్లోజైంది. ఇక మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఇక బ్యాంకు షేర్లు కూడా ఆరంభంలో కోలుకున్నట్లే కన్పించినా… మిడ్‌ సెషన్‌ తరవాత కుప్పకూలింది. అయితే 2 గంటల నుంచి వచ్చిన రికరీతో 1000 పాయింట్లు కోలుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 4 శాతం, అదానీ పోర్ట్స్‌ ఒక శాతం లాభంతో క్లోజయ్యాయి. అయినా అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్‌ ఎఫ్‌పీఓ ధరను దాటలేకపోయింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో ఉన్న అదానీ గ్రీన్‌ 20 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 20 శాతం చొప్పున నష్టపోగా, అదానీ ట్రాన్స్‌మిషన్‌15 శాతంపైగా నష్టపోయింది. అదానీ గ్రూప్‌లోని అంబుజా సిమెంట్‌ ఒక శాతం, ఏసీసీ ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. అదానీ విల్మర్‌, అదానీ పవర్‌ 5 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ కౌంటర్లలో కొనుగోలుదారులు లేరు.