For Money

Business News

రికార్డు లాభాల్లో ముగిసిన నిఫ్టి

పడిన ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో నిఫ్టి పెరుగుతోంది. నిన్న భారీ నష్టాల్లో ప్రారంభమైనా… సగంపైగా నష్టాలను రికవర్‌ చేసుకుంది. ఇవాళ 80 పాయింట్ల లాభంతో ప్రారంభమై 446 పాయింట్ల లాభంతో ముగిసింది. ఒకదశలో 17777 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో 17759 వద్ద ముగిసింది. రేపు వినాయక చతుర్థి సెలవు కావడం.. ఎల్లుండి వీక్లీ డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్‌ కావడంతో… ఉదయం నుంచి నిఫ్టికి మద్దతు లభిస్తూనే వచ్చింది. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటంతో సాధారణ ఇన్వెస్టర్లు కూడా లాంగ్‌ పొజిషన్స్‌కు ఆసక్తి చూపారు. మిడ్‌ సెషన్‌లో యూరప్‌ మార్కెట్లు ఏకంగా రెండు శాతం దాకా లాభాలతో ప్రారంభం కావడంతో… షార్ట్‌ కవరింగ్‌ ఊపందుకుంది. ఏదశలోనూ నిఫ్టికి ఒత్తిడి రాలేదు. దీంతో నిఫ్టిలోని 50 షేర్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇవాళ బజాజ్‌ ట్విన్స్‌ దుమ్ము రేపాయి. ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైన రిలయన్స్‌కు కూడా మద్దతు అండంతో మార్కెట్‌లోని ఇతర షేర్లకు ఊతం లభించింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన దివీస్‌ ల్యాబ్‌ రూ.44 లాభపడింది. నిన్న, ఇవాళ ఈ షేర్‌ రూ.150పైగా పెరగడం విశేషం. లోకల్‌ కంపెనీ రెయిన్‌ బో హాస్పిటల్స్‌ భారీ లాభాల్లో ప్రారంభమైనా… లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. బ్యాంక్ నిఫ్టి 3.29 శాతం లాభంతో ముగిసిందంటే… ఆ కౌంటర్లలో లాభాలను ఊహించుకోవచ్చు. దాదాపు ప్రధాన షేర్లన్నీ మూడు నుంచి నాలుగు శాతంపైగా పెరిగాయి. డీఎల్ఎఫ్‌ అయిదు శాతంపైగా పెరిగింది. జొమాటొ, పేజీఎంలు నష్టాల్లో క్లోజ్‌ కావడం విశేషం. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలో కూడా బీఈఎల్‌ తప్ప అన్ని షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 4.6 శాతం పెరిగింది.