For Money

Business News

లాభాల్లో ముగిసిన నిఫ్టి

దిగువ స్థాయి నుంచి ఏకంగా 160 పాయింట్లు కోలుకుంది నిఫ్టి. ఉదయం అనుకున్నట్లే దిగువ స్థాయిలో నిఫ్టికి గట్టి మద్దతు లభించింది. యూరో మార్కెట్లకు ముందు ఒత్తిడికి లోనైనా నిఫ్టి… యూరో మార్కెట్లు పాజిటివ్‌గా ఉండటంతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ కూడా లాభాల్లోకి రావడంతో… చివరి అరగంటలో భారీ షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. రేపు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉండటంతో నిఫ్టి 17388 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 43 పాయింట్లు పెరిగింది. నిఫ్టి గ్రీన్‌లో ముగిసినా… లాభాలు కేవలం ప్రధాన ఐటీ కౌంటర్లకు పరిమితం కావడంతో ఇతర సూచీలో లాభాలు కన్పించలేదు. దాదాపు అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి బ్యాంక్‌ క్రితం ముగింపు వద్దే క్లోజ్‌ కాగా, నిఫ్టి నెక్ట్స్‌ 0.38 శాతం… నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీ ఒక శాతంపైగా నష్టంతో ముగిసింది. నిఫ్టి టాప్‌ 5లో టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ ఉన్నాయి. అయితే ఇవాళ ఐటీ కౌంటర్‌లో అత్యధికంగా పెరిగిన షేర్‌ ఎల్‌ అండ్‌ టీ ఐ, ఇక నష్టాల విషయానికొస్తే ఆటో షేర్లు భారీగా నష్టపోయాయి. భారత్‌ ఫోర్జ్‌, బాష్‌, మారుతీ షేర్లు నిఫ్టి ఆటోను దెబ్బతీశాయి. ఈ వారంలో తొలిసారి నిఫ్టి పీఎస్‌యూ బ్యాంక్‌లు నష్టంతో ముగిశాయి.