For Money

Business News

16500పైన ముగిసిన నిఫ్టి

మార్కెట్‌ విశ్లేషకులు ఊహించినట్లే 16500పైన నిఫ్టిలో లాభాల స్వీకరణ వచ్చింది. అయినా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ముగియడం విశేషం. మిడ్‌ సెషన్‌ సమయంలో 16588 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నిఫ్టి తాకింది. యూరో మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో ఓపెన్‌ కావడం, అమెరికా ఫ్యూచర్స్‌ లాభాలు కూడా అంతంతే ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దీంతో నిఫ్టి 16490కి పడింది.అయినా చివర్లో వచ్చిన మద్దతుతో కారణంగా నిఫ్టి 16520 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 180 పాయింట్లు లాభపడింది. రేపు డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉండటంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఇవాళ తమ పొజిషన్స్‌ను స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకున్నట్లు కన్పిస్తోంది. నిఫ్టి నెక్ట్స్‌ ఒక్కటే కేవలం 0.18 శాతం లాభంతో ముగిసింది. మిగిలిన సూచీలన్నీ 0.7 శాతంపైగా లాభంతో ముగిశాయి. పలు ఫార్మా, హాస్పిటల్‌ షేర్లలో లాభాల స్వీకరణ వచ్చింది. ఇవాళ ఐటీ షేర్లు బాగా రాణించాయి. ఓఎన్‌జీసీ తరవాత టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్‌ షేర్లు ఆకర్షణీయ లాభాలు గడించాయి. ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 2 శాతం నష్టపోయి నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. నిఫ్టి నెక్ట్స్‌ సూచీలో వేదాంత 6 శాతం దాకా లాభపడింది. మిడ్‌ క్యాప్‌ నిఫ్టిలో టాప్‌ గెయినర్స్‌ అన్నీ దాదాపు ఐటీ షేర్లే. బ్యాంక్‌ నిఫ్టిలో 2 శాతం లాభంతో ఎస్‌బీఐ టాప్‌లో నిలిచింది. ఈ స్థాయి ర్యాలీలో కూడా ఎల్‌ఐసీ నష్టాల్లో ముగియడం విశేషం.