For Money

Business News

నిర్మలమ్మ బడ్జెట్‌ రూ.40 లక్షల కోట్లు?

ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టే బడ్జెట్‌ రూ.40 లక్షల కోట్లకు చేరే అవకాశముంది. గత బడ్జెట్‌తో పోలిస్తే 14 శాతం పెరిగి రూ. 39.6 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఈసారి ఆమె ప్రవేశపెడతారని తెలుస్తోంది. అయితే ఈసారి రాష్ట్రాల మాదిరిగానే భారీ ఎత్తున అప్పులు చేసే అవకాశముంది. ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం, మిగిలిన అమ్మడానికి ఇబ్బందులు ఎదురు కావడంతో… డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా పెద్దగా రాకపోవచ్చు. ఎల్‌ఐసీ డిజిన్వెస్ట్‌మెంట్‌ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేస్తారు. యూపీ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో … పన్నులు పెంచే జోలికి వెళ్ళకపోవచ్చు. అలాగే వ్యక్తిగత పన్నుల స్లాబుల జోలికి కూడా పోకపోవచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరుగుతుండటం, మార్కెట్‌లో ధరలు పెంచే పరిస్థితి లేకపోవడంతో బడ్జెట్‌లో ఖర్చులు భరించేందుకు కేంద్రం రూ. 13 లక్షల కోట్ల మేర అప్పులు చేసే అవకాశముంది. అనేక వర్గాలు పలు డిమాండ్లు ఆర్థిక మంత్రి ముందు పెడుతున్నా… ఆర్థిక సంస్కరణల జోలికి ఈసారి ప్రభుత్వం వెళ్ళకపోవచ్చు. పైగా ముందే బడ్జెట్‌పై ప్రజల్లో పెద్దగా అంచనాలు లేకుండా చూశారు. దీంతో బడ్జెట్‌ ఏమాత్రం కాస్త సానుకూలత కన్పించినా.. బడ్జెట్‌ చాలా పాజిటివ్‌ అనిపిస్తుంది. పైగా గత కొన్నేళ్ళుగా బడ్జెట్‌ ప్రక్రియకు విలువ లేకుండా పోయింది. గతంలో కీలక ఆర్థిక నిర్ణయాలు బడ్జెట్‌ సమయంలోనే తీసుకునేవారు. ఏడాది మధ్యలో ఎలాంటి టింకరింగ్‌ ఉండేది కాదు. దీంతో స్థిర విధానాలు ఏడాది మొత్తం అమలయ్యేవి. కాని ఇపుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికపుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో బడ్జెట్ ఇపుడు కేవలం జమా, ఖర్చులు వివరించే పత్రంలా మారిపోయింది. కరోనా కారణంగా దేశంలో ధనిక, పేదల మధ్య అంతరం బాగా పెరిగిందని… ప్రభుత్వం వెంటనే ధనికులపై సర్‌ చార్జి వేయాలని ఆక్స్‌ఫామ్‌ వంటి సంస్థలు చెబుతున్నాయి. అలాగే మనరేగా వంటి స్కీమ్‌ను పట్టణ ప్రాంత పేదలకు ప్రారంభించాలన్న డిమాండ్‌ కూడా ఉంది. సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే పట్టణ ప్రాంత ప్రజలకు మనరేగా వంటి పథకం తెస్తామని పేర్కొంది. మరి నిర్మలమ్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.