మళ్ళీ మొదటిస్థానం ముకేష్‌దే
ఫోర్బ్స్ ఇండియా భారత కుబేరుల జాబితాలో మళ్ళీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ నంబర్ వన్ స్థానాన్ని పొందారు. 9,270 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.86 లక్షల కోట్లు) సంపదతో వరుసగా 14వ ఏడాదీ ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు. ఏడాదిలో ఆయన ఆస్తి 400 కోట్ల డాలర్ల మేర పెరిగిందని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. కంపెనీల్లో వాటాల విలువతో పాటు కుటుంబాలు, వ్యక్తులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, విశ్లేషకులు, భారత నియంత్రణ సంస్థల నుంచి సెప్టెంబరు 17, 2021 వరకు వచ్చిన ఆర్థిక సమాచారం ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
ఇక రెండో స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన సంపద 7,480 కోట్ల డాలర్లు (రూ.5.53 లక్షల కోట్లు)గా లెక్కగట్టారు. ఈయన సంపద కూడా ఏడాదిలో మూడింతలైంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, డీ-మార్ట్ స్టోర్ల అధిపతి రాధాకిషన్ దమానీ, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్ పూనావాలా వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచారు. హిందూజా సోదరుల సంపద 1,400 కోట్ల డాలర్లకు తగ్గింది. వీరి స్థానం 15కు పడిపోయింది. ఇక మహిళల్లో సావిత్రి జిందాల్ 1800 కోట్ల డాలర్లతో ఏడో స్థానంలో ఉన్నారు.