For Money

Business News

17400పైనే కొనసాగుతున్న నిఫ్టి

మిడ్‌సెషన్‌కు ముందు స్వల్ప ఒత్తిడికి లోనైనా… నిఫ్టి 17400పైనే ట్రేడవుతోంది. ఇపుడు 17402 పాయింట్ల వద్ద 128 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి.. పడిన ప్రతిసారీ పుంజుకుంది. 17428 గరిష్ఠ స్థాయిని తాకిన తరవాత 17340ని తాకినా.. వెంటనే కోలుకుంది. కాస్సేపటి క్రితం ప్రారంభమైన యూరో మార్కెట్లు ఇవాళ కూడా లాభాల్లో ఉన్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిబాట పట్టిందన్న వార్తలతో యూరో మార్కెట్లు అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. డాలర్‌ స్థిరంగా ఉంది. అలాగే క్రూడ్‌ కూడా. ఉదయం డల్‌గా ఉన్న నిఫ్టి బ్యాంక్‌ బాగా కోలుకుని ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఇక మిడ్‌ క్యాప్‌ షేర్లు మాత్రం ఉదయం నుంచి అదరగొడుతున్నాయి. ముఖ్యంగా భారత్‌ ఫోర్జ్‌, పెర్సిస్టెన్స్‌ షేర్లు 7 నుంచి 8 శాతం దాకా లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ రెండు షేర్లను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రెకమెండ్‌ చేశాయి. మెటల్స్‌, సిమెంట్‌ షేర్లతో పాటు ఐటీ షేర్లకు కూడా మద్దతు లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అమ్మకాలు తగ్గుముఖం ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు చెబుతుండటంతో… ఈ రంగానికి చెందిన షేర్లపై తీవ్ర ఒత్తిడి వస్తోంది.గోద్రెజ్‌ కన్జూమర్‌ షేర్‌ 5 శాతం క్షీణించింది.