For Money

Business News

నిత్యావసర వస్తువులపై నో జీఎస్‌టి

నిత్యావసర వస్తువులపై కేంద్రం జిఎస్‌టి విధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వీటిపై జీఎస్‌టీ రూపంలో పన్ను బాదడంతో సామాన్య జనం మరింత భారం పడునుంది. 25 కిలోలు లేదా లీటర్ల లోపు ఉన్న ఆహార పదార్థాలు ప్యాక్‌ చేసి అమ్మితే 5 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంది. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కుటుంబ శ్రీ’ లేదా చిన్న చిన్న దుకాణాల్లో 1, 2 కేజీల ప్యాకెట్ల రూపంలో లేదా లూజుగా విక్రయించే నిత్యావసర వస్తువులపై జిఎస్‌టి విధించబోమని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రంతో సమస్యలొచ్చినా తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ ప్రకటన చేశారు. ఇదే విషయాన్ని కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
‘కుటుంబ శ్రీ’ అనేది కేరళలో స్వయం సహాయక సంఘం. మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన దేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్‌ ఇదే. వీటి ఆధ్వర్యంలో చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలు నడుస్తుంటాయి.

నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీ విధించడం వల్ల సామాన్యుల చాలా ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ లేఖలో పేర్కొన్నారు. కేరళలో మిల్లర్లు, చిన్న చిన్న దుకాణాలు నడిపేవారు సైతం వస్తువులను ముందుగానే ప్యాకేజీ చేసి విక్రయిస్తుంటారని తన లేఖలో విజయన్‌ పేర్కొన్నారు. ఇక్కడ ప్యాక్‌ చేసి విక్రయించడమనేది సర్వసాధారనమని, ఇప్పుడు ఈ ప్యాక్‌ చేసిన వస్తువులపై జీఎస్‌టీ విధించడం వల్ల వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విజయన్‌ పేర్కొన్నారు.