For Money

Business News

త్వరలో జియో ఫైనాన్షియల్స్‌ లిస్టింగ్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన ఆర్థిక సేవల వ్యాపార విభాగాన్ని ప్రత్యేక సంస్థగా విభజించి, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ చేయనున్నట్లు ప్రకటించింది. వంద శాతం అనుబంధ సంస్థ అయిన రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎప్‌ఐఎల్‌) ఆర్థిక సేవల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీని విడగొట్టి కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఆ కంపెనీకి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (జేఎఫ్‌ఎస్‌ఎల్‌)గా పేరు పెట్టనున్నారు. కొత్త కంపెనీ ఏర్పాటు పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరుగుతుందని కంపెనీ పేర్కొంది. దీనికిగాను రిలయన్స్‌ వాటాదారులకు కంపెనీలో కలిగి ఉన్న ప్రతి ఒక్క షేరుకు గాను ఒక జియో ఫైనాన్షియల్‌ షేరును జారీ చేయనున్నట్ల్లు కంపెనీ తెలిపింది. కన్జూమర్‌ అండ్‌ మర్చంట్‌ లెండింగ్‌ వ్యాపారంలోకి జియో ఫైనాన్స్‌ ప్రవేశించనుంది. వ్యాపార విస్తరణ, జాయింట్‌ వెంచర్‌ భాగస్వామ్యాలతో పాటు బీమా, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ బ్రోకింగ్‌ వ్యాపారాల కొనుగోళ్లపైనా దృష్టి సారించనున్నట్లు రిలయన్స్‌ తెలిపింది. రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ (ఆర్‌ఐఐఎల్‌)లోని పెట్టుబడులను సైతం జియో ఫైనాన్స్‌కు బదిలీ చేస్తారు.