For Money

Business News

ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ ఏమంటుందో?

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) శుక్రవారం పరపతి విధాన సమీక్షను వెల్లడించనుంది మానిటరీ పాలసీ కమిటీ (పీపీసీ) సమావేశం బుధవారమే ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు దేశీయంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని కమిటీ మదింపు చేసి శుక్రవారం పరపతి విధానం ప్రకటించనుంది. అంతర్జాతీయ కమాడిటీ ధరలు ముఖ్యంగా క్రూడ్‌ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగి పోతోంది. ధరలను అదుపు చేయడం కష్టంగా మారుతోంది. వరుసగా ఎనిమిదోసారీ ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథ స్థితినే కొనసాగిస్తుందని చాలా మంది బ్యాంకర్లు అంటున్నా… మరి ద్రవ్యోల్బణాన్ని ఎలా అదుపు చేస్తుందనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్‌ ఎదురు చూస్తోంది. ‘ముడి చమురు, సహజ వాయువు, బొగ్గు ధరలు కచ్చితంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయ’ని పీడబ్ల్యూసీ ఇండియా అధిపతి రాణేన్‌ బెనర్జీ(పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఎకనమిక్స్‌) అంటున్నారు. ‘రేట్ల పెంపు ఉండకపోవచ్చు. ద్రవ్యోల్బణం ఇంకా భరించగలిగే స్థాయిలోనే ఉండడం, 10 ఏళ్ల బాండ్ల ప్రతిఫలం 6 శాతం పైన కొనసాగుతుండడం దీనికి కారణాల’ని ఆయన అంచనా వేశారు. స్థిరాస్తి కంపెనీలు కూడా ఇదే అంచనా వేస్తున్నాయి. అయితే ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్బీఐ మార్చే అవకాశముందని కూడా తెలుస్తోంది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌ రూపాయి మరింత బలహీన పడి 75కు చేరింది. ఏడాది చివరి నాటికి ఇది 76 నుంచి 77కు చేరే అవకాశముంది. బయట దేశాలకు డబ్బు పంపిచే వారికి చార్జీలతో కలిపి డాలర్‌ 80కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఇదే సమయానికి 90 డాలర్లకు చేరుతాయని కూడా అంటున్నారు. ఒకవైపు రూపాయి బలహీనపడి.. మరోవైపు క్రూడ్‌ పెరిగితే దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది.