For Money

Business News

8 నెలల్లో మీ ఈఎంఐ 23 శాతం పెరిగింది

చాలా మందికి వడ్డీ రేట్లు పెరిగినా.. ఆ నొప్పి తెలియకుండా బ్యాంకులు ఓ సౌలభ్యం కల్గిస్తూ వచ్చాయి. అదేమిటంటే… ఈఎంఐ మొత్తాన్ని పెంచకుండా… రుణం చెల్లించాల్సిన వాయిదాల సంఖ్యను పెంచుతూ వచ్చాయి బ్యాంకులు. దీంతో చాలా మంది వడ్డీ రేట్లు పెరిగినా.. పెద్దగా ఇబ్బంది పడేలేదు. అయితే ఇవాళ ఆర్బీఐ మరో 0.35 శాతం వడ్డీని పెంచింది. వాస్తవానికి ఇది బేస్‌ వడ్డీ మాత్రమే. ఇంకా ఎక్కువ రేటుకు బ్యాంక్‌ రుణం ఇస్తుంది. మే నుంచి ఇప్పటి వరకు రెపో రేటు 1.90 శాతం పెరిగిందని ఆర్బీఐ చెబుతున్నా… మీకు పెరిగిన వడ్డీ 2.25 శాతం. ఎందుకంటే ఒకసారి పెరిగాక… మరోసారి వడ్డీ పెరిగినపుడు … ఇంతకుముందు పెరిగిన మొత్తంపై తాజా వడ్డీ లెక్కిస్తారు. ఆ లెక్కన ఈ ఏడాది మార్చిలో మీరు రూ. 30 లక్షల రుణం 20 ఏళ్ళకు తీసుకుని ఉంటే.. అపుడు ఈఎంఐ రూ. 23,258 అయి ఉంటుంది. ఇపుడు అది రూ. 27,387 అవుతుందని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. అంటే మీ ఈఎంఐ మొత్తం 17.75 శాతం పెరిగిందన్నమాట. అదే రుణం మీరు 30 ఏళ్ళకు తీసుకుని ఉంటే మీ ఈఎంఐ మొత్తం 23 శాతం పెరిగి ఉంటుంది. అదే మీరు పదేళ్ళకే తీసుకుని ఉంటే ఈఎంఊ 9.96 శాతం పెరిగి ఉంటుందని ఆ పత్రిక పేర్కొంది.
గడచిన 8 నెలల్లో అయిదుసార్లు వడ్డీ పెంచింది ఆర్బీఐ. సాధారణంగా ఇలా వడ్డీ రేట్లు పెరిగినపుడు బ్యాంకుల ఈఎంఐ మొత్తాన్ని పెంచకుండా వాయిదాలను పెంచుతూ వచ్చాయి. చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం ఏకంగా 20 శాతం వరకు పెరగడంతో… ఇక వాయిదాలు కూడా పెంచలేని స్థితికి రుణాలు చేరాయి. దీంతో రుణాలు తీసుకున్నవారు ఇక నుంచి పెరిగిన ఈఎంఐ చెల్లించక తప్పదు. ఎందుకంటే 60 లేదా 65 ఏళ్ళు దాటిన వారికి రుణవాయిదాలు పెంచరు. అలాగే గరిష్ఠంగా 30 ఏళ్ళకు మించి రుణం ఇవ్వరు. సో.. రుణ గడువు 30 ఏళ్ళు దాటినా… వయసు 65 ఏళ్ళు దాటినా.. ఈఎంఐల సంఖ్యను పెంచే ఛాన్స్‌ లేదు. ఒకవేళ వాయిదాలను పెంచే అవకాశముంటే ఆ సౌకర్యాన్నే ఉపయోగించుకోవాలని ట్యాక్స్‌ నిపుణులు అంటున్నారు.