For Money

Business News

నిరాశపర్చిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ పనితీరు నిరాశాజనకంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చినా లేదా రెండో త్రైమాసికంతో పోలిస్తే ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్‌ 11 శాతం పెరిగి రూ. 606 కోట్ల నుంచి రూ. 670 కోట్లకు పెరిగినా… నికర లాభం 21 శాతం క్షీణించి రూ. 26 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పడిపోయింది. అదే రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్‌లో పెద్ద మార్పు లేదు. రూ. 673 కోట్ల నుంచి రూ. 670 కోట్లకు తగ్గింది. అయితే నికర లాభం ఏకంగా 36 శాతంపైగా క్షీణించి రూ. 32.76 కోట్ల నుంచి రూ. 20.8 కోట్లకు పడిపోయింది. దీంతో ఈపీఎస్‌ 36 శాతం తగ్గి రూ. 7.06 నుంచి రూ. 4.49కు పడిపోయింది.
డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు గాను రూ.1,985.40 కోట్ల ఆదాయంపై రూ.83.9 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది.

కొత్త ఉత్పత్తులు
వాల్యూ యాడెడ్‌ ఉత్పత్తుల పోర్టుఫోలియో విస్తరణతో డిసెంబరు త్రైమాసిక ఆదాయంలో పటిష్ఠమైన వృద్ధిని నమోదు చేసినట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రహ్మణి నారా వెల్లడించారు. డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయటంతో పాటు డెట్‌ ఫ్రీ హోదా, కంపెనీ చేతిలో నగదు నిల్వలు సరిపడినంత స్థాయిలో ఉండటం కూడా కలిసి వచ్చిందని పేర్కొన్నారు. కాగా డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ వివిధ విభాగాల్లో పలు ఉత్పత్తులను విడుదల చేసిందని బ్రహ్మణి తెలిపారు. వెనీలా, బటర్‌స్కాచ్‌, చాక్లెట్‌ ఫ్లేవర్లలో ఫ్రోజెన్‌ డిసర్ట్‌ ప్యాక్‌లతో పాటు ఎంపిక చేసిన మార్కెట్లలో ఏ2 ఫ్రెష్‌ మిల్క్‌ను హెరిటేజ్‌ ఫుడ్స్‌ విడుదల చేసింది. త్రైమాసిక కాలంలో బెంగళూరు మార్కెట్లోకి హెరిటేజ్‌ నొవాండై ఫుడ్స్‌ అడుగుపెట్టడంతో పాటు అన్ని మార్కెట్లలోకి నేచురల్‌ ఫ్రెష్‌ ప్రొ బయోటిక్‌ పెరుగును ప్రవేశపెట్టినట్లు బ్రహ్మణి నారా వెల్లడించారు.
నిన్న మార్కెట్‌లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్‌ ఒకదశలో 5 శాతం క్షీణించి రూ.391.55కు క్షీణించింది. తరవాత కోలుకుని రూ.402 వద్ద ముగిసింది.