మిడ్ క్యాప్స్ విలవిల
చాలా మంది ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలలో మిడ్ క్యాప్ షేర్లే ఉంటాయి. ఇటీవలి కాలంలో ఈ షేర్లే ఆకర్షణీయ లాభాలు ఇచ్చాయి. ఇపుడు మార్కెట్ పూర్తిగా లార్జ్‌క్యాప్ షేర్లకు మళ్ళింది. పరోక్షంగా చెప్పాలంటే నిఫ్టిలోని షేర్ల ద్వారా సూచీల కంట్రోల్ ప్రారంభమైంది. అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లను మార్కెట్ వొదిలేసింది. విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయంగా ప్రమోటర్లు, పెద్ద ఇన్వెస్టర్లు భారీగా షేర్లను అమ్ముతున్నారు. ముఖ్యంగా గత నెల మొత్తం విదేశీ ఇన్వెస్టర్లు 425 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మినట్లు ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతోంది. అయితే ఈ నెల తొలి మూడు రోజుల్లోనే ఇంతకుమించి అమ్మకాలు చేశారు విదేశీ ఇన్వెస్టర్లు. మరోవైపు భారతీ ఎయిర్టెల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌తో పాటు అనేక కంపెనీల ప్రమోటర్లు తమ షేర్లను అమ్ముతున్నారు. వాస్తవానికి FIIల అమ్మకాల కంటే అనేక రెట్లు అధికంగా మన దేశ ప్రమోటర్లు అమ్ముతున్నారు. దీంతో మిడ్ క్యాప్ షేర్లలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. సూచీలు ఆల్‌టైమ్ హైని తాకగా… మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు 20 శాతం నుంచి 30 శాతం క్షీణించాయి. గత నెల రోజుల నుంచి దాదాపు డబుల్ అయిన మిడ్ క్యాప్ బ్యాంకు షేర్లు కేవలం రెండు రోజుల్లో పది శాతందాకా నష్టపోయాయి. అనేక రూమర్స్‌తో ఈ షేర్లు పెరిగాయి. ముఖ్యంగా FDI పరిమితి పెంచుతారంటూ వచ్చిన వార్తలతో ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి షేర్లు భారీగా పెరిగాయి. అయితే ఇపుడు డబుల్ స్పీడ్‌తో పడుతున్నాయి.
