For Money

Business News

కుప్పకూలిన మిడ్‌ క్యాప్‌ షేర్లు

నిఫ్టి చూస్తుంటే 0.32 శాతం మాత్రమే పడింది. మార్కెట్‌ స్థిరంగా ఉన్నట్లే కనిపిస్తోంది. కాని లోలోపల ఇవాళ పడిన దెబ్బకు ఇన్వెస్టర్ల దిమ్మతిరిగింది. మిడ్‌ క్యాప్‌ షేర్లలో రక్తపాతమే. నిఫ్టి పరిస్థితి కూడా అదే. ఉదయం 18,600 పాయింట్ల వద్ద అమ్మినవారికి ఇవాళ కనకవర్షం. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి అంటే 18,604 నుంచి నిఫ్టి 18,377కు పడింది. అంటే 225 పాయింట్లు పడింది. దీనికి ప్రధాన కారణం సాంకేతిక కారణాల వల్ల నిన్న చాలా మంది ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మలేకపోవడమే. వారందరూ 18,600 ప్రాంతంలో ఇవాళ వైదొలిగినట్లు తెలుస్తోంది. CSDLతో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా జీరోద, ఐసీఐసీఐ డైరెక్ట్‌ వంటి బ్రోకరేజీలు కూడా నిన్న సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడ్డాయి. మిడ్‌ సెషన్‌లో ఓపెనింగ్‌ స్థాయికి వెళ్ళిన నిఫ్టి… తరవాత వచ్చిన ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి చేరుకుంది. చివర్లో స్వల్పంగా కోలుకుని 58 పాయింట్ల నష్టంతో 18,418 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ కూడా 1.4 శాతం క్షీణించింది. అసలు అమ్మకాలు మిడ్‌ క్యాప్‌లో జరిగాయి. మిడ్‌క్యాప్‌ నిఫ్టి ఒకదశలో 4శాతం పైగా నష్టపోయింది. చివర్లో కోలుకున్నా 2.22 శాతం నష్టంతో ముగిసింది. సరిగ్గా రెండు గంటలకు మొదలైన మార్కెట్‌ పతనం 3.15కల్లా కనిష్ఠ స్థాయికి చేరింది.