For Money

Business News

HDFC: కాల్‌ ఆప్షన్స్‌లో కనక వర్షం

వారం రోజుల క్రితం జీరోదా బ్రోకరేజీ సంస్థ అధినేత నితిన్‌ కామత్‌ ఇన్వెస్టర్లకు ఓ హెచ్చరిక చేశాడు. మార్కెట్‌లో అనిశ్చితిలో ఉన్నపుడు చిన్న ఇన్వెస్టర్లు ఎపుడూ కాల్‌, పుట్‌ రైటింగ్‌ చేయొద్దని అన్నాడు. చిన్న ఇన్వెస్టర్లు కాల్‌ లేదా పుట్‌ కొనుగోలు చేయడమే మంచిదని, కాంట్రాక్ట్‌ రైటింగ్‌ రివర్స్‌ అయితే నష్టం భరించలేరని హెచ్చరించాడు. అదే కాల్‌ లేదా పుట్‌ రైట్‌ చేసినపుడు వ్యూహం కరెక్టయితే సరే… అదే వికటిస్తే… అపరిమిత నష్టం భరించాల్సి ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ కౌంటర్లలో ఇవాళ అదే జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు గత నెల చివర్లో భారీ ఒత్తిడికి గురయ్యారు. ఒకదశలో ఈ షేర్‌ రూ.1,307లకు పడిపోయింది. అయితే నిన్న క్లోజింగ్‌ కల్లా రూ. 1506కి చేరింది. అంటే పది రోజుల్లోనే రూ.200 పెరిగింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఈ షేర్‌ను అమ్మారు. కొందరు పుట్స్‌ కొంటే, కొందరు కాల్స్‌ అమ్మారు. అయితే ఉదయం 9 గంటల వరకు హెచ్‌డీఎఫ్‌సీ విలీన వార్త బయటికి వచ్చింది. మీడియాతో సహా ఎవరికీ ఈ విషయం తెలియదు. మార్కెట్‌లో కనీసం ఊహాగానాలు కూడా లేవు. ఓపెనింగ్‌లోనే హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ భారీ లాభాలతో పెరిగింది. నిన్న కాల్‌ రైటింగ్‌ చేసినవారందరూ ఇవాళ షార్ట్‌ కవరింగ్‌కు పరుగులు తీశారు. దీంతో అరగంటలోనే షేర్‌ రూ.1722ని తాకింది. దీనికి ప్రధాన కారణం… నిన్న షేర్లు అమ్మినవారు వెంటనే కొనుగోలు చేయడం ప్రారంభించడం. మన మార్కెట్‌లో 90 శాతం టర్నోవర్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లోనే జరుగుతుంది. ముఖ్యంగా నిన్న ఎవరూ పట్టించుకోని కాల్స్‌ ఇవాళ 1000 శాతం పైగా పెరిగాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏప్రిల్‌ నెల రూ.1,650 కాంట్రాక్ట్‌ కాల్‌ ఆప్షన్‌ నిన్న రూ.3.40 వద్ద ముగిసింది. ఇవాళ ఓపెనైన కొన్ని నిమిషాల్లోనే ఆ ఆప్షన్‌ విలువ రూ.43.20ని తాకింది. అంటే 1,276 శాతం పెరిగింది. అలాగే రూ. 1640 కాల్‌ ఆప్షన్‌ నిన్న రూ.3.80 వద్ద క్లోజ్‌ కాగా ఇవాళ రూ.52.30ని తాకింది.అంటే 1,276 శాతం పెరిగింది. రూ.1660 కాల్‌ ఆప్షన్‌ రూ.3.05 నుంచి రూ. 43.20కి (1,316 శాతం) పెరిగింది. నిన్నటి షేర్‌ క్లోజింగ్‌ ధరకు దగ్గరగా ఉన్న కాల్‌ ఆప్షన్స్‌ అన్ని 800 శాతం నుంచి 1,300 శాతం పెరిగాయి. అన్నిటికన్నా విషాదమేమిటంటే… ఓపెనింగ్‌లోనే ఈ స్థాయిలో పెరగడంతో భయపడినవారు వెంటనే భారీ నష్టంతో పొజిషన్స్‌ కవర్‌ చేసుకున్నారు. ఓపిగ్గా ఉన్నవారు కాస్త తక్కువ నష్టాలతో బయటపడ్డారు. మొత్తానికి షేర్‌ పట్ల పాజిటివ్‌ ధోరణి ఉన్న ఇన్వెస్టర్లకు ఇవాళ కాసుల పంటే.