For Money

Business News

వ్యవసాయ కూలీకి దినసరి వేతనం

భారత రిజర్వు బ్యాంకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల గురించి తాజా నివేదిక విడుదల చేసింది. వ్యవసాయ కూలీలకు (పురుషులు) చెల్లించే దినసరి వేతనంలో కేరళ నంబర్‌ వన్‌గా నిలిచింది. ఈ కూలీలకు చెల్లించే దినసరి వేతనం జాతీయ సగటు రూ.323 కాగా, కేరళలో వ్యవసాయ కూలీకి రోజుకు రూ.726.8 చెల్లిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఆ తరవాతి స్థానంలో జమ్మూ కాశ్మీర్‌ ఉంది. ఆ రాష్ట్రంలో వ్యవసాయ కూలీకి దినసరి కూలీ రూ.524.6. దక్షిణాదిలో మరో ప్రధాన రాష్ట్రమైన తమిళనాడులో ఈ కూలీ రూ. 445.6 కాగా, ఏపీలో (తెలంగాణ గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు, కాబట్టి ఉమ్మడిగానే భావించాలి) రూ.340.5గా పేర్కొంది. ఇక కర్ణాటకలో లభిస్తున్న దినసరి కూలి రూ. 335.20గా ఆర్బీఐ పేర్కొంది. ఇండియన్‌ లేబర్‌ బ్యూరో ప్రచురించే ఇండియన్‌ లేబర్‌ జర్నల్‌లో ఇచ్చిన పది నెలల కూలీ సగటు మొత్తం ఆధారంగా ఈ నివేదిక రూపిందించినట్లు ఆర్బీఐ పేర్కొంది.
అతి తక్కువ బీజేపీ రాష్ట్రాల్లో …
వ్యవసాయ కూలీలకు అతి తక్కువ దినసరి కూలీ లభించే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ ముందు ఉండటం విశేషం. జాతీయ సగటు కూలీ రూ.323.20 కాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో రూ.217.8. ఈ రాష్ట్రంలో రూ. 2017-18 నుంచి 2019-20 మధ్య కాలంలో దినసరి కూలీ రూ. 191 నుంచి రూ. 198కి పెరగ్గా, గత రెండు సంవత్సరాల్లో రూ. 217 వద్దే ఉండటం విచిత్రం. ఇక గుజరాత్‌దీ మరీ చెత్త రికార్డు. ఈ రాష్ట్రంలో ఇపుడు వ్యవసాయ కార్మికులకు దినసరి కూలీ రూ.220 కాగా, గత ఏడాది రూ. 213.. 2019-20లో తొలిసారి ఈ రాష్ట్రంలో దినసరి కూలీ రూ. 200దాటి రూ. 208కి చేరింది. ఆర్బీఐ తాజా నివేదిక చూస్తే… 2014 నుంచి గుజరాత్‌లో వ్యవసాయ కూలీల దినసరి వేతనం జాతీయ సగటు కంటే చాలా తక్కువ ఉంది. 2014లో జాతీయ సగటు రూ. 224.60 కాగా, గుజరాత్‌లో దినసరి వేతనం రూ. 160 మాత్రమే. దశాబ్దాల పాటు బీజేపీ పాలనలో ఉన్న ఈ రాష్ట్రాల్లో వ్యవసాయ కూలీలకు కనీసం జాతీయ సగటులో కూడా దినసరి వేతనం చెల్లించకపోవడం… డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ మహత్యమేమో!