For Money

Business News

5 ఏళ్ళు కాదు.. 35 ఏళ్ళు లీజుకు

రైల్వే స్థలాలను దీర్ఘకాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం రైల్వే స్థలాలను అయిదేళ్ళకు లీజుకు ఇస్తున్నారు. దీన్ని 35 ఏళ్ళకు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఇవాళ నిర్ణయించింది. అలాగే వీటి ల్యాండ్‌ లైసెన్స్‌ ఫీజును కూడా తగ్గించింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల రాబోయే ఐదేళ్లలో 300 కార్గో టర్మినళ్లు ఏర్పాటు అవుతాయని చెప్పారు. ల్యాండ్‌ లీజు ఫీజు ఇపుడు 6 శాతం ఉండగా, దీన్ని 1.5 శాతానికి తగ్గించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతిపాదిత మార్పులు కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ కంపెనీ షేర్‌ ఇవాళ మార్కెట్‌లో 8 శాతం దాకా పెరిగింది. కాంకర్‌లోని 30.8 శాతం వాటాతో విక్రయంతో పాటు, యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేసేందుకు 2019 నవంబర్‌లోనే మోడీ ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ తాజా నిర్ణయం వవల్ల రైల్వే స్థలాల్లో సోలార్‌ ప్లాంట్లను తక్కువ ధరకే పెట్టుకునే వీలు సైతం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ‘పీఎం-శ్రీ పాఠశాలలు’ ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. దీనికిగాను రూ.27,360 కోట్లు అవుతాయని అంచనా. ఈ పథకం కింద కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు సహా 14వేలకు పైగా స్కూళ్లను బలోపేతం చేసి పీఎం-శ్రీ (పీఎం స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పాఠశాలలుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.