For Money

Business News

వివో మొబైల్స్‌: రూ. 465 కోట్ల నగదు జప్తు

మొన్నటి దాకా ఐపీఎల్‌ను స్పాన్సర్‌ చేసిన చైనా కంపెనీ వివో మొబైల్స్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రూ. 465 కోట్ల నగదు జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. వివిధ బ్యాంకుల్లో కంపెనీకి చెందిన 119 అకౌంట్లలో ఈ మొత్తం ఉన్నట్లు పేర్కొంది. ఇందులో వివో ఇండియాకు చెందిన రూ. 66 కోట్ల ఫిక్సెడ్‌ డిపాజిట్లు కూడా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. నగదుతో పాటు 2 కిలోల బంగారం, రూ. 73 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ నెల 5వ తేదీన ఈ కంపెనీతో పాటు దీనికి సంబంధించిన 23 అనుబంధ కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 48 స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. హాంగ్‌కాంగ్ స్థావరంగా పనిచేసిన ఈ కంపెనీ భారత్‌లో అనేక కంపెనీలను ఏర్పాటు చేసింది. భారత్‌లో ఈ కంపెనీ రూ.1.25 లక్షల కోట్ల అమ్మకాలు జరిపిందని.. ఇందులో రూ. 62,470 కోట్లను విదేశాలకు ముఖ్యంగా చైనాకు తరలించిందని ఈడీ ఆరోపించింది. అంటే అమ్మకాల్లో సగం మొత్తం విదేశాలకు తరలించినట్లు పేర్కొంది. వివో ఇండియాతో పాటు గ్రాండ్‌ ప్రాస్పెక్టస్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కంపెనీ ద్వారా అనేక అనుబంధ కంపెనీలు నెలకొల్పినట్లు తమ పరిశోధనలో వెల్లడైందని అన్నారు.